విశాఖ(Visaka),
సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఎవరెవరు పోటీచేస్తారు అనేదాని మీద అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో బీజేపీ కూడా దాదాపు చేరబోతుంది. మరోవైపు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏయే సీట్లలో పోటీ చేయాలో కసరత్తు జరుగుతున్నది. అనకాపల్లి MP సీటు తమదే అంటూ జనసేన పార్టీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
పొత్తులో భాగంగా జిల్లాలోని ఏకైక లోక్‌సభ(lok sabha) స్థానం అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి ఇరుపార్టీల నేతలు ఆసక్తి చూపుతూ, టికెట్ తమకు కేటాయించాలని పార్టీ అధినేతలను కోరుతున్నారు. వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో పాటు తాము కూటమిగా పోటీ చేస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానాన్ని కచ్చితంగా గెలుచుకుంటామని టీడీపీ, జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ పోటీ చేయాలన్న దాని పై రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీల అగ్రనేతలు ఇంత వరకు ఒక నిర్ణయానికి రాలేదు. తన కుమారుడు, ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కు అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో బైరా ఫౌండేషన్ ఛైర్మన్, పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇతను ఇటు టీడీపీ, అటు జనసేన సభ్యుడు కానప్పటికీ అనకాపల్లి సీటు ఏ పార్టీకి కేటాయిస్తే ఆ పార్టీలో చేరి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.
అనకాపల్లి ఎంపీ సీటు ఎవరికి..? | Anakapalli MP seat
అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన పార్టీ అధినేత పవణ్‌కల్యాణ్(Pawan kalyan) సోదరుడు, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు(Naga Babu) పేరు తెరపైకి వచ్చింది. గత వారం రోజుల నుంచీ ఆయన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడడమే కాకుండా టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఆయా సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నారు. దీంతో పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు కేటాయిస్తారని, నాగబాబు పోటీ చేస్తారని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
పదిహేను సంవత్సరాల క్రితం సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున ఆయన బావమరిది, నిర్మాత అల్లు అరవింద్ అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేశారు. అప్పటి కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చిన ఆయన 2,94,183 ఓట్లతో (28 శాతం) మూడో స్థానంలో నిలిచారు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సబ్బంహరి విజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్‌కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరపున పోటీకి సోదరుడు నాగబాబు పేరు తెరపైకి వస్తోంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.