మహాశివరాత్రి (Mahashivratri) :
మహాశివరాత్రి (Mahashivratri) సందర్భంగా కాకినాడ జిల్లాలోని పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ బుధవారం నుంచి 11వ తేదీ సోమవారం వరకూ మహా శివరాత్రి ఉత్సవాలు జరగనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ళ నీలకంఠం తెలిపారు. శివరాత్రి ఉత్సవాల్లో భక్తుల సౌకార్యార్థం అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఈవో నీలకంఠం మీడియాతో మాట్లాడుతూ 6వ తేదీ బుధవారం ఉదయం 9.25 గంటలకు విగ్నేశ్వర పూజ, అంకురార్పనతో మహా శివరాత్రి పూజలు ప్రారంభిస్తుండగా రాత్రి 9.20 గంటలకు స్వామివారి దివ్య కళ్యాణం జరగనున్నట్టు చెప్పారు. అలాగే 7వ తేదీన స్వామి వారికి, అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు, సాయంత్రం నీరాజన మంత్ర పుష్పములు నిర్వహించనున్నట్టు చెప్పారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ముఖ్యంగా 8వ తేదీ మహా శివరాత్రి పర్వదినం కావడంతో తెల్లవారు జాము ఒంటి గంట నుంచి స్వామివారి మూల విరాట్ నందు అభిషేక పూజలు జరగనున్నట్టు చెప్పారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగోద్భావ కాల పూజ, పిఠాపురం రాజా వారి గోత్ర నామాలతో నిర్వహించనున్నట్లు చెప్పారు. 9వ తేదీ శనివారం మధ్యాహ్నం 3.20 గంటల నుంచి స్వామివారి రధోత్సవం కన్నుల పండుగగా పుర వీదుల్లో నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు. 10వ తేదీన స్వామివారికి, అమ్మవారికి త్రిసూల స్నానం, తీర్దపు సేవ నిర్వహించనున్నట్టు చెప్పారు. తదుపరి 11వ తేదీ సోమవారం రాత్రి 7.45 గంటల నుంచి స్వామి వారికి, అమ్మవారికి శ్రీ పుష్ప యోగోత్సవం పూజలు ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ పూజాలతో ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారి నీలకంఠం వివరించారు. అలాగే ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతీరోజు రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. కాగా మహా శివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి రానుండడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, సేవా కార్యక్రమాలు, భారీ బందోబస్తు, స్వచ్ఛంద సంస్థల సేవలు అందుబాటులో ఉంచుతున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి నీలకంఠం తెలిపారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి