ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసులో సుప్రీంకోర్టు ఈ రోజు సంచలన తీర్పు వెలువరించింది. ఇలాంటి కేసుల్లో చట్ట సభ్యులకు ఎలాంటి మినహాయింపు ఉండదని చీఫ్ జస్టిస్ డీవై చంద్ర చూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. చట్ట సభల్లో ఓటు వేయడానికి, ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్న కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు రక్షణ కల్పిస్తూ 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా పక్కన పెట్టేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పార్లమెంటరీ అధికారాల ద్వారా లంచం రక్షింపబడదని పేర్కొన్న న్యాయస్థానం.. 1998 నాటి తీర్పు వివరణ రాజ్యాంగంలోని 105, 194 ఆర్టికల్స్‌కు విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధులు భయం లేకుండా పనిచేసేందుకు ఈ రెండు అధికరణలు వారికి ప్రాసిక్యూషన్ నుంచి చట్టపరమైన మినహాయింపును అందిస్తాయి. పీవీ నరసింహారావు కేసు తీర్పుతో తాము విభేదిస్తున్నట్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. పార్లమెంటులో ఓటు వేసేందుకు, లేదంటే ప్రసంగించేందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై చట్టసభ్యుడికి మినహాయింపునిస్తూ ఇచ్చిన తీర్పు విస్తృత పరిణామాలు కలిగి ఉందని, కాబట్టి దానిని రద్దు చేసినట్టు సీజేఐ స్పష్టం చేశారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి