భారతదేశంలో వెలిసిన అష్టాదశ శక్తిపీఠాలలో ‘ఆలంపూర్ జోగులాంబ’ ఐదవది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆలంపూర్ ప్రాంతంలో వుంది. సతీదేవి పై దవడ దంతాలు ఇక్కడ పడ్డాయంటారు. భక్తులకు రక్షణనిచ్చి, సదా వారి గృహాలను కాపాడే దేవతగా, తమ ఇళ్ళ వాస్తుదోషాలను పోగట్టే గృహ చండిగా, దుష్టదృక్కులనుంచీ, దుష్ట శక్తులనుంచీ కాపాడే దేవతగా ఈ అమ్మవారిని కొలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. ఆలయ చరిత్ర క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 9వ శతాబ్దంలో జగద్గురువు శ్రీ శంకరాచార్యులవారు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారంటారు. 14వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు. ఆలయ స్థల పురాణం శివుని భార్య సతీదేవి తన తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అక్కడ అవమానాల పాలవుతుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. విషయం తెలుసుకున్న శివుడు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని.. భార్య మీదున్న ప్రేమతో ఆమె మృతదేహాన్ని తన భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివుని వరప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది. ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.
జోగులాంబ దేవస్థానం
223