అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లాకు రానున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాలను మరోసారి గెలుచుకోవడమే లక్ష్యంగా కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలోని సిరిసిల్ల, ధర్మపురి, మంథని, పెద్దపల్లి, కోరుట్ల నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కరీంనగర్లో నాలుగో సారి పోటీచేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ రెండో విడతలో కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పాల్గొని ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభలకు భారీ జన సమీకరణతో విజయవంతం చేయడం ద్వారా పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నింపే విధంగా చర్యలు చేపట్టారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించిన కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలోనే ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. గంగాధర మండలం పత్తికుంటపల్లిలో చొప్పదండి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ, హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ప్రజా ఆశీర్వాద సభలకు కూడా భారీ జనసమీకరణ చేస్తున్నారు. మరో 13 రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఆశీర్వాద సభలతో పార్టీశ్రేణులు, ప్రజల్లో గెలుపు ఖాయమనే మెస్సేజీ తెచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు.
సీఎం పర్యటన వివరాలు
- శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌నుంచి సీఎం కేసీఆర్ బయలు దేరి 12.50కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
- 12.55కు హెలిక్యాప్టర్‌లో బయలుదేరి కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ హెలీప్యాడ్ గ్రౌండ్‌కు 1.30కి చేరుకుంటారు. అనంతరం ఎస్సారార్ కళాశాల మైదానానికి చేరుకుని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
- 2.35కు అక్కడి నుంచి బయలు దేరి గంగాధర మండలం పత్తికుంట గ్రామానికి 2.40కి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు.
- 3.20కు అక్కడి నుంచి జమ్మికుంటకు 3.50 నిమిషాలకు చేరుకుని సభలో ప్రసంగిస్తారు.
- 4.30కు హన్మకొండ జిల్లా పరకాలకు బయలుదేరుతారు.
- సీఎం పర్యటన సందర్భంగా ఎస్సారార్ కళాశాల మైదానం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
Read Also..