ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు. తన కూతరు అరెస్ట్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించలేదు. తాజాగా లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీ కీలక నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన తొలిసారి తన కూతురు గురించి మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని కేసీఆర్ చెప్పారు. దాన్ని తాము ముందే పసిగట్టి అడ్డుకున్నామని తెలిపారు.
ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన బీజేపీ నేత బీఎల్ సంతోష్ పై కేసులు పెట్టి, అరెస్ట్ చేయడానికి యత్నించడం కారణంగానే… తన కూతురు కవితను అరెస్ట్ చేశారని చెప్పారు. సంతోష్ పై కేసులు పెట్టడం వల్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమపై కక్ష కట్టిందని అన్నారు. తన కూతురును అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో కవిత పాత్ర ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేసీఆర్ అన్నారు. కవిత 100 కోట్లు కాదు కనీసం 100 రూపాయల తప్పుకూడా చేయలేదని తెలిపారు. తన కూతురు అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కుట్రేనని చెప్పారు. ఆనాడు సంతోష్ ను అరెస్ట్ చేయడానికి తాము యత్నించకపోతే… ఈ రోజు కవిత అరెస్ట్ అయి ఉండేది కాదని అన్నారు.