ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తరలివచ్చే భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను రూపొందించేందుకు సమాయత్తం అవుతోంది. కొన్ని సౌకర్యాల విషయంలో భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధ్యయనం చేయించాలంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వద్దకు ప్రతిపాదనలు అందాయి. త్వరలో మంత్రి ఆలయాన్ని సందర్శించాలని నిర్ణయించినట్లు సమాచారం. అనంతరం అధ్యయనానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సదుపాయాలపై భక్తుల నుంచి స్పందన ను ఏవిధంగా తీసుకుందామన్న అంశంపై అధికారులు మేదోమథనం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడా కియోస్క్‌లను ఏర్పాటు చేయడమా? ఆన్లైన్ ద్వారా స్పందనను నమోదు చేయడమా? అన్న అంశాలపై త్వరలో స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ద్వారా భక్తుల స్పందనను తెలుసుకునే విధానం ఇప్పటివరకు లేదు. ఈ విధానాన్ని అమలుచేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
47
previous post