ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారంతో ఆయనను సత్కరించారు. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్సతో మోడీని సత్కరించింది స్వీడన్ ప్రభుత్వం. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్ అందించే అత్యున్నత స్థాయి గుర్తింపు, గౌరవం ఇదే కావడం గమనార్హం. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు ప్రధాని మోడీ దక్కించుకున్నపురస్కారాల సంఖ్య 31కు చేరింది. ఇక అంతకు ముందు, స్వీడన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ ఘన స్వాగతం పలికారు. ఇది ఇలా ఉండగా ప్రధాని నరేంద్ర మోడీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం అందించడంపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రధాని మోడీ చేసిన విశేష కృషి, దార్షనిక నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు వెల్లడించింది కేంద్ర సర్కార్. ఇది ఇండియాకు గర్వ కారణమని తెలిపింది.
National
వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. CNG ధరలను కేంద్రం మరోసారి పెంచింది. కిలోకు రూపాయి చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల వ్యవధిలో సీఎన్జీ ధరలు రెండోసారి పెరిగాయి. రెండ్రోజుల క్రితం కిలో గ్యాస్‌పై 2 రూపాయల చొప్పున పెంచారు. దీంతో మూడ్రోజుల వ్యవధిలో CNG వాహనదారులపై 3 రూపాయల అదనపు భారం పడినట్లయింది.
తాజా పెంపుతో హైదరాబాద్‌లో 100 రూపాయలకు చేరింది కిలో CNG ధర. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో 80, నోయిడా-గాజియాబాద్ ప్రాంతంలో రూ.88.70గా ఉండగా..ముంబైలో రూ.84 రూపాయలుగా ఉంది. పశ్చిమాసియా యుద్ధం, హర్మూజ్ జలసంధిలో ఆంక్షల నేపథ్యంలో గ్యాస్, చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. అంతర్జాతీయంగా ఉత్పత్తి, సరఫరా దెబ్బతినడంతో ఇంధన కొరత ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి. ఫలితంగా దేశీయంగానూ ధరల పెంపు అనివార్యమైంది.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2024, 2026 సంవత్సరాల పరిస్థితులను పోలుస్తూ ప్రభుత్వ వైఖరిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదేపదే పేపర్ లీక్‌లు జరుగుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందని ఆరోపించారు.
నీట్ పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నా విద్యా మంత్రి రాజీనామా చేయలేదని విమర్శించారు. మళ్లీ సీబీఐ విచారణ, మరో కమిటీ ఏర్పాటవుతుందంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీకి దేశం తరఫున కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నానని రాహుల్ పేర్కొన్నారు. మిస్టర్ మోదీ, దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. వాటికి సమాధానం చెప్పండి… అంటూ మూడు సూటి ప్రశ్నలను లేవనెత్తారు.
పదేపదే పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయి?, పేపర్ లీక్‌లపై చర్చ విషయంలో మీరెందుకు మౌనంగా ఉంటున్నారు?, పదేపదే విఫలమవుతున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఎందుకు పదవి నుంచి తొలగించడం లేదు? సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వరుస పేపర్ లీక్‌ల పట్ల కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి తగదంటూ ఆయన హితవు పలికారు.
తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్‌స్టార్ రజినీకాంత్. తమిళ ప్రజలు మార్పు కోరుకున్నారని..అందుకే విజయ్ గెలిచారని అన్నారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తానే గనక పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినన్న తలైవా.. డీఎంకే అధినేత స్టాలిన్ తనకు మంచి స్నేహితుడని తెలిపారు. అందుకే ఆయన్ని కలిసినట్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల అనంతరం స్టాలిన్‌ను కలిసిన నేపథ్యంలో రజినీపై విమర్శలొచ్చిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. మరోవైపు విజయ్ సీఎంగా గెలవకూడదని తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని రజినీకాంత్ చెప్పారు. విజయ్ను తనకు సమవుజ్జీగా భావించడం లేదని.. తమ ఇద్దరి వయసులో 25 ఏళ్ల తేడా ఉందన్నారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడతాను గానీ, విజయ్ విషయంలో అలాంటిదేమీ లేదన్నారు.
భారత సాంస్కృతిక వారసత్వ సంపద పునరుద్ధరణలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 11వ శతాబ్దపు చోళ రాజవంశానికి చెందిన అత్యంత అరుదైన, పవిత్రమైన రాగి శాసనాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం భారతదేశానికి అధికారికంగా అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఈ చారిత్రక ఆధారాలను భారత్‌కు హ్యాండోవర్ చేశారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరికొత్త మైలురాయిగా నిలిచింది. ఐదు దేశాల పర్యటనలో భాగంగా యూఏఈ పర్యటన ముగించుకుని శుక్రవారం నెదర్లాండ్స్ చేరుకున్న పీఎం మోదీ సమక్షంలో ఈ బదిలీ ప్రక్రియ జరిగింది. ఈ పర్యటనలో స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలు కూడా ఉన్నాయి.
ప్రసిద్ధ హిందూ చక్రవర్తి రాజరాజ చోళుడి కాలానికి చెందిన ఈ రాగి శాసనాలు సుమారు 30 కిలోల బరువు కలిగి ఉన్నాయి. చోళ రాజవంశపు రాజముద్ర కలిగిన ఒక కాంస్య రింగ్‌తో ఇవన్నీ ఒకదానికొకటి బంధించబడి ఉన్నాయి. ఈ శాసనాలు రెండు విభాగాలుగా విభజించబడ్డాయి. ఇందులో ఒక భాగం సంస్కృత భాషలో, మరొక భాగం తమిళ భాషలో చెక్కబడి ఉంది.మహారాజ రాజరాజ చోళుడు ఒక బౌద్ధ విహారానికి భూగ్రామ రూపంలో ఇచ్చిన ఆదాయ విరాళాల వివరాలు ఈ శాసనాల్లో ఉన్నాయి. రాజా రాజరాజ చోళుడు మొదట దీనిని తాటి ఆకులపై రికార్డు చేయగా, ఆ తర్వాత అతని కుమారుడైన రాజేంద్ర చోళుడు ఈ దానాన్ని శాశ్వతంగా భద్రపరచడం కోసం మన్నికైన రాగి రేకులపై చెక్కించారు. ఈ పలకలను బంధించే కాంస్య ఉంగరంపై రాజేంద్ర చోళుడి ముద్ర ఉంటుంది.
తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇంటి నుంచి లంచ్ బాక్స్‌తో సమయానికి పావుగంట ముందే సచివాలయానికొచ్చేస్తున్నారు. లంచ్ బ్రేక్ టైమ్‌లో తన చాంబర్లోనే భోజనం ముగించి మళ్లీ పనిలో నిమగ్నమవుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా, ఎన్నికల హామీలను అమలు చేసేందుకు ఆర్థిక వనరులు సమకూర్చుకునే విషయాలపై ఫోకస్ పెడుతున్నారు. ఇందులో భాగంగా కీలక ఫైళ్లను పరిశీలిస్తూ..ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారు. ఆయన పనిలో చూపుతున్న వేగం, నిబద్ధత అధికారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు భారీ ఊరట లభించింది. హర్యానాలోని గురుగ్రామ్ భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనకు ఉపశమనం కలిగింది. ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆయనకు ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
హర్యానాలోని శిఖోపూర్ గ్రామంలో 2008లో జరిగిన 3.53 ఎకరాల భూ లావాదేవీల చుట్టూ ఈ వివాదం నడుస్తోంది. రాబర్ట్ వాద్రాకు చెందిన ‘స్కై లైట్ హాస్పిటాలిటీ’ సంస్థ..ఒంకార్వేగర్ ప్రాపర్టీస్ నుంచి ఈ భూమిని కొనుగోలు చేసింది. ఈ డీల్ సమయంలో తప్పుడు పత్రాలు సమర్పించారని, ఎలాంటి నగదు చెల్లించకుండా లావాదేవీలు జరిపారని ఈడీ ఆరోపించింది. అప్పటి రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి ఈ భూమికి కమర్షియల్ లైసెన్స్ సంపాదించి, ఆ తర్వాత దానిని DLF సంస్థకు భారీ లాభానికి విక్రయించారని ఈడీ పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారం ద్వారా PMLA చట్టం ప్రకారం 58 కోట్ల మేర అక్రమ సొమ్ము ఆర్జించారని ఈడీ చార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది.
ఈ కేసు చార్జ్‌షీట్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టు రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేస్తూ మే 16న హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ హాజరైన వాద్రాకు 50వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తానికి సమానమైన ఒక షూరిటీ సమర్పించాలనే షరతుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై స్పందించిన రాబర్ట్ వాద్రా దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అయితే దర్యాప్తు సంస్థ అయిన ఈడీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటోందని ఆరోపించారు. తన వద్ద దాచడానికి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది. సోలాపూర్‌కు చెందిన శివాజీ రాథోడ్ అనే యువకుడు తన వైద్యానికి 7 లక్షల రూపాయలు సమీకరించాలనే ఉద్దేశంతో ఈ డ్రామాకు తెరలేపాడు. హడప్సర్లోని కామధేను ఎస్టేట్ ప్రాంతంలోని ఆసుపత్రి మరుగుదొడ్డిలో డిజిటల్ క్లాక్, పైపులు, వైర్లతో బాంబులా కనిపించే వస్తువును ఉంచి బెదిరింపులకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా గాలింపు చేపట్టగా… టేపు కొనుగోలుకు చేసిన డిజిటల్ చెల్లింపు ఆధారంగా నిందితుడిని నాగ్‌పూర్ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. నేపాల్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆలయ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. గత 2003లో కుదిరిన ASI ఒప్పందం ప్రకారం.. ఈ ప్రాంగణంలో హిందువులు ప్రతి మంగళవారం పూజలు చేయడానికి, ముస్లింలు ప్రతి శుక్రవారం నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఉండేది. అయితే ఈ ప్రాంగణంపై తమకే పూర్తి హక్కులు కల్పించాలని ప్రత్యేక పూజా హక్కులు ఇవ్వాలని హిందూ పక్షం హైకోర్టును ఆశ్రయించింది.
ఈ స్థలం తమదంటే తమదే అంటూ ఇండోర్ హైకోర్టును ఇరువర్గాలు ఆశ్రయించాయి. దీంతో ఇక్కడ శాస్త్రీయ సర్వే జరగాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో 2024లో 98 రోజుల పాటు పురావస్తు శాఖ సర్వే (ASI ) నిర్వహించింది. అనంతరం 2 వేల పేజీలకుపైగా ఉన్న నివేదికను సిద్ధం చేసి కోర్టుకు సమర్పించింది. మసీదు నిర్మాణం కంటే ముందే అక్కడ భారీ ఆలయం ఉన్నట్లుగా ఆ ప్రాంతంలో లభించిన పలు శిల్పాలు, స్తంభాల శిథిలాలు, శాసనాలు తెలియజేస్తున్నాయన్నారు. ఇవి పర్మార్ రాజవంశం కాలానికి చెందినవని ఈ సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వేలో లభించిన పురాతన నాణేలు, శిల్పాలు, సంస్కృత శాసనాలు ఈ ప్రాంగణం ఒకప్పుడు దేవాలయమే అనడానికి బలమైన సాక్ష్యాలని హిందూ పక్షం వాదించగా ASI నివేదిక ఏకపక్షంగా ఉందంటూ ముస్లిం పక్షం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే చరిత్ర, శాస్త్రీయ ఆధారాలు, చట్టపరమైన నిబంధనలను పరిశీలించిన కోర్టు.. మే 12న తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తుది తీర్పును ప్రకటించింది
దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్రబిందువైన నీట్ యూజీ 2026 పరీక్షపై కీలక అప్డేట్ వెలువడింది. ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల ఆరోపణలతో రద్దైన ఈ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త తేదీని ప్రకటించింది. జూన్ 21, ఆదివారం దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలను త్వరలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. మే 3న నిర్వహించిన పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల నిరసనలు వ్యక్తమవ్వగా, కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం, పరీక్షా సంస్థలపై ఒత్తిడి పెరిగింది.
తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ చర్చల అనంతరం రీ-ఎగ్జామ్ తేదీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ అనుమతి అనంతరం ఎన్టీఏ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రీ-ఎగ్జామ్ ద్వారా విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని..ఈసారి పరీక్ష నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు తెలిపారు.