అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ గురించి చాలా మందికి తెలిసిందే. ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర స్థలాల్లో ఒకటి. ఈ గురుద్వార గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. పంజాబ్‌లోని ఈ అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోనే అత్యంత సుందరమైన పవిత్ర స్థలాల్లో ఒకటి. అలాగే సిక్కుల ప్రధాన గురుద్వార్ కూడా ఈ స్వర్ణ మందిరమే. దీంతో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి కేవలం సిక్కులు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఎవరైనా ఈ ఆలయ సముదాయంలోకి అడుగు పెట్టగానే ఎక్కడా దొరకని ప్రశాంతత ఆవహిస్తుంది. ఈ గోల్డెన్ టెంపుల్ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే ప్రార్థనా మందిరాల్లో ఒకటిగా పేరుగాంచింది. తిరుమల శ్రీవారిని నిత్యం వాలేది మంది భక్తులు దర్శించుకున్నట్లే ఇక్కడికి కూడా దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీ టూరిస్టులు సైతం ఎంతో మంది వచ్చి ఈ గురుద్వారను సందర్శిస్తుంటారు. ఈ గురుద్వారకున్న ప్రత్యేకమైన ఆకర్షణే బంగారు తాపడం. ఈ మందిరం చుట్టూ 24 క్యారెట్ల బంగారు పూతను అద్దడం విశేషం. దీంతో ఈ ఆలయానికి స్వర్ణమందిరం అనే పేరొచ్చింది. మహారాజా రంజిత్ సింగ్ అనే వ్యక్తి తొలిసారి ఈ ఆలయానికి బంగారం జోడించాలని అనుకున్నారు. అలా మొదట 162 కిలోల బంగారు పూతతో ప్రారంభించగా 90ల కాలంలో 500 కిలోల బంగారు పూతను ఆలయానికి అతికించారు. దీంతో ఈ గురుద్వార దగదగలాడుతుంది. ఈ గోల్డెన్ టెంపుల్లో నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజన ఏర్పాట్లు చేస్తుంది. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లంగర్ సేవను అందిస్తున్న దేవాలయంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇక్కడికి వచ్చే భక్తులూ, టూరిస్టులు ఎవరైనా సరే నేల మీద కూర్చొనే ఆహారం తీసుకుంటారు. ఇక్కడ కులమతాలకతీతంగా ప్రతి ఒక్కర్నీ సమానంగా చూడటం విశేషం. దీంతో వేలాదికి మందికి ఇక్కడ ఉచితంగా ఆహారం అందుతుంది. మీరెప్పుడైనా ఈ స్వర్ణ మందిరాన్ని నిశితంగా పరిశీలించారా? అలా గమనిస్తే ఈ ఆలయ నిర్మాణ శైలి మీకు అర్థమవుతుంది. ఈ ఆలయాన్ని హిందూ – మొఘల్ కలయిక శైలిలో అద్భుతంగా నిర్మించారు. గోపురం వెలుపలి భాగం నుండి కిటికీలు, గుమ్మాల వరకు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. దీంతో ఈ గోల్డెన్ టెంపుల్ నిర్మాణ కూడా ఓ అద్భుతమనే చెప్పాలి. ఇతర మతపరమైన ప్రదేశాల మాదిరిగా కాకుండా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి ఉండే మెట్ల మార్గం కిందకు ఉంటుంది. అంటే దీని అర్థం దేవుడి దగ్గరకు వచ్చే భక్తులు తమకున్న అహంకారం, రాగద్వేషాలను వదులుకొని వినయ పూర్వకంగా మెలగాలని. ప్రతి ఒక్కరూ ఇలాంటి నిరాడంబరమైన జీవనశైలిని కలిగి ఉంటే దేవుని ఆశిస్సులు ఉంటాయనేది దానివెనకున్న ఉద్దేశం. ఈ ఆలయం అన్ని మతాల వారికీ తెరిచి ఉంటుంది. అందుకే ఈ ఆలయానికి నలుదిక్కులా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. అంటే ఇది అన్ని మతాల వారినీ ఆదరిస్తుందని అర్థం. మరోవైపు ఆలయ నిర్మాణ సమయంలోనూ గురు అర్జన్ దేవ్ సుఫీ సెయింట్ మియాన్ మీర్‌ను ఆలయ శంకుస్థాపనకు ఆహ్వానించారు. దాంతో అక్కడ కుల, మతాలతో సంబంధం లేకుండా ఆలయానికి ఎవరైనా వెళ్లొచ్చనే భావన కలిగించారు. అలాగే ఈ స్వర్ణ మందిరంలో ఎవరైనా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గోల్డెన్ టెంపుల్లో మీ సేవలు అందించవచ్చు. అక్కడ మీరు సేవ చేయడానికి కచ్చితంగా సిక్కులే అయి ఉండాల్సిన పనిలేదు. మీకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే హ్యాపీగా అక్కడ పాల్గొనవచ్చు.
గోల్డెన్ టెంపుల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..!
81
previous post