ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్ రైలు స్టేషన్ కి మూడు కిలోమీటర్ల దూరంలోని మట్టెవాడ ప్రాంతంలో వుంది. ఈ ఆలయానికి ‘భోగేశ్వరాలయం’ అనే పేరు రావడం వెనుక ఓ పురాణ కథ అమలులో వుంది. ప్రతిరోజూ రాత్రిపూట ఒక పాము ఇక్కడికొచ్చి ఈశ్వరుని సేవించేదట. పానవట్టముమీద పైనున్న లింగభాగాన్ని జరపటానికి వీలుగా వున్నది. దాని క్రింది భాగం బోలుగా వుంటుంది. ఇక్కడ అడుగుభాగంలో శివలింగం కింద మేరు ప్రస్తారంలో శ్రీ చక్రం వుందట. శీచక్రం బిందుస్ధానంలో మరొక చిన్న రాతి శివలింగం వుంది. అక్కడ ఒక పెద్ద శ్రీ చక్రము, ఆ శ్రీచక్రబిందు స్ధానంలో ఒక లింగము, శ్రీ చక్రాన్ని కప్పివేస్తూ నిర్మించిన పెద్దపానవట్టము, ఆ పానవట్టముమీద కదల్చటానికి వీలుగా చెక్కిన మరొక శివలింగము వున్నాయి. దానికింద పదకొండు శివ లింగాలు వున్నాయని, అందుకే ఈ భోగేశ్వర స్వామికి ఒక్కసారి అభిషేకంచేస్తే ఏకాదశరుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కుతుందంటారు. ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ ఎన్ని బిందెలనీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసినా ఆ నీరు ఒక్క చుక్కైనా బయటికి రాదు ఎక్కడికి పోతుందో కూడా తెలీదు. ఈ లింగానికి వెనుక భాగంలో పార్వతీ పరమేశ్వరుల విగ్రహం కూడా ప్రతిష్టించబడింది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయం ప్రసిద్ధి చెందకపోవడానికి కొన్ని వాస్తుదోషాలు వున్నాయని చెబుతారు. స్వామి ఉత్తర ముఖంగా వున్నాడు. అంటే పూజించేవారు దక్షిణ ముఖంగా వుండి చెయ్యాలి. అది శాస్త్ర సమ్మతం కాదంటారు. నైఋతిలో బావి వుందన్నారు కానీ వాస్తుదోషం కారణంగా దానిని మూసేశారుట. ఆలయ ప్రవేశద్వారం ఈశాన్యంలో వున్నది. ఇదికూడా వాస్తు శాస్త్ర విరుధ్ధమే. ఈ ఆలయంలో శివరాత్రి వగైరా పర్వదినాలలో ప్రత్యేక పూజలే కాక మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంరోజున ద్వార దర్శనం వుంటుంది.
‘భోగేశ్వరాలయం’ ప్రత్యేకతలు
156
previous post