భారతదేశంలో నమ్మశక్యం కానీ వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో దేవతలను తిడుతూ భజిస్తారు, కొన్ని చోట్ల దెయ్యాల్ని వదిలిస్తారు, మరికొన్ని చోట్ల భక్తులు తలలు పగలకొట్టుకుని రక్తాన్ని చిందిస్తారు. ఆధ్యాత్మికతకు ఆలవాలం భారతదేశం అంటారు. 64 కోట్ల దేవతలు కలిగిన ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు. ఇక్కడ అడుగడుగునా దేవాలయాలు మనం చూడవచ్చు. కానీ విచిత్రమైన, అసాధారణ దేవాలయాలు కొన్ని మాత్రమే చూడగలం. ఈ దేవాలయాల్లో ఉండే నమ్మశక్యం కాని నిజాలు వీటిని ప్రత్యేకంగా నిలిపాయి. అందులో కొన్ని 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి కావడం విశేషం. అసలు ఈ అసాధారణ దేవాలయాల విశేషాలు ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. మహేందిపుర్ బాలాజీ దేవాలయం, రాజస్థాన్ :
రాజస్థాన్ లోని డౌస జిల్లాలోని మహేందిపుర్ బాలాజీ దేవాలయానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దెయ్యాల్ని, ఆత్మల్ని వదిలించుకోవడానికి వస్తుంటారు. వీపరీతమైన చర్యల ద్వారా, ఉదాహరణకు శరీరంపై వేడి నీరు పోయడం, పై కప్పు నుంచి వేలాడదీయడం, గోడలకు తలను కొట్టడం, గోడలకు మనిషిని తాళ్లతో కట్టడం వంటివి దుష్టశక్తుల నుంచి బాధితున్ని బయటపడేస్తాయని ఇక్కడ నమ్ముతారు. భారతదేశంలో ఇప్పటికీ భూతవైద్యం జరుగుతున్న ప్రదేశంగా ఈ ఆలయానికి గుర్తింపు ఉంది. ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఇవ్వరు. అలాగే ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెబుతారు. ఎందుకంటే దుష్టశక్తులు దీనిని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయని బలంగా నమ్ముతారు.
2. కామఖ్య దేవి ఆలయం, అస్సాం :
అస్సాంలోని గువహతిలో ఉన్న నీలాచల్ కొండపై భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కామాఖ్య దేవి ఆలయం ఉంది. భారతదేశంలోని 51 పురాతన శక్తి పీఠాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. మహాశివుని భార్య అయిన సతీదేవి యోని ఇక్కడ పూజలందుకుంటుంది. దీనిపై ఎర్రటి వస్త్రాన్ని కప్పుతుంటారు. ప్రతి ఏటా వర్షాకాలం సమయంలో ఈ దేవత రుతుక్రమం జరుగుతుంది. అందుకే ఆ సమయంలో మూడు రోజుల పాటు దేవాలయాన్ని మూసి వేస్తారు. ఆలయం తెరిచే నాల్గవ రోజు వరకూ ఇక్కడ తాంత్రిక సంతానోత్పత్తి పండుగ లేదా అంబుబచి మేళాను జరుపుతుంటారు. ఈ మూడు రోజుల్లో ఆలయంలో అమ్మవారి పీఠం దగ్గర వచ్చే జలం ఎర్రగా వస్తుందని చెబుతారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారికి ఎర్రని వస్త్రాలను కానుకగా సమర్పిస్తుంటారు.
3. దేవ్ జీ మహరాజ్ మందిర్, మధ్య ప్రదేశ్ :
ప్రతి నెలా పౌర్ణమి రోజున భక్తులు తమకు పట్టిన దెయ్యాలను, దుష్ట శక్తులను వదిలించుకోవడానికి మధ్య ప్రదేశ్ లోని దేవ్ జీ మహరాజ్ ఆలయానికి వస్తుంటారు. దుష్ట శక్తులు ఎవరినైతే వేధిస్తాయో వారి అరచేతులపై కర్పూరం వెలిగించి వాటిని వదిలించడం ఇక్కడి సాధారణ పద్ధతి. వారి చుట్టూ పరిగెత్తడం లేదా చీపురుతో కొట్టడం వంటివి కూడా చేస్తుంటారు. దుష్టశక్తులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఏటా ఇక్కడ ‘భూత్ మేళా’ లేదా ‘దెయ్యాల ఉత్సవం’ నిర్వహిస్తుంటారు. భారతదేశం యొక్క పరిష్కరించలేని రహస్య దేవాలయాల్లో ఇది ఒకటి.
4. కాలభైరవనాథ్ దేవాలయం, వారణాసి :
పవిత్ర వారణాసి నగరంలో గల కాల భైరవ్ నాథ్ ఆలయంలోని దేవుణ్ణి మహాశివుని ప్రతిరూపంగా భావిస్తారు. అయితే ఇక్కడ నమ్మశక్యం కానీ నిజం ఏమిటంటే కాల భైరవ్ నాథ్ కు నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. అది కూడా విస్కీ లేదా వైన్ మాత్రమే. విగ్రహం యొక్క నోట్లో ఆ మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. సాధారణంగా ఆలయాల బయట దుకాణాల్లో పువ్వులు, స్వీట్స్ ను అమ్ముతుంటారు. కానీ ఇక్కడ ఆలయం బయట మద్యాన్ని అమ్మడం విశేషం.
5. కొడంగల్లూర్ భగవతి ఆలయం, కేరళ :
కాళీ దేవి యొక్క పునర్జన్మగా భావించే భద్రకాళి దేవికి కొడంగల్లూర్ భగవతి ఆలయంలో ప్రతి ఏటా ఏడు రోజుల వింత భరణి పండుగ నిర్వహిస్తుంటారు. ఈ పండుగలో మహిళలు, పురుషులు ఎర్రని వస్త్రాలు ధరించి, కత్తులు పట్టుకుని ఒక తెలియని స్థితిలో తిరుగుతుంటారు. రక్తం కారే విధంగా కత్తులతో తలపై కొట్టుకుని దేవిని నీచమైన పదాలతో తిడుతూ పాటలు పాడుతుంటారు. అమ్మవారికి ఇచ్చే కానుకలను సాధారణ పద్ధతిలో సమర్పించకుండా దేవత విగ్రహం వద్దకు వాటిని విసురుతారు. ఆ తరువాత ఆలయం స్తంభాలను కర్రలతో పదేపదే కొడతారు. పండుగ తరువాత 7 రోజులు ఆలయాన్ని మూసి వేసి రక్తపు మరకలను శుభ్రం చేస్తారు.
6. స్తంభేశ్వర్ మహదేవ్, గుజరాత్ :
మీరు రోజంతా కనిపించి అదృశ్యమయ్యే దేవాలయాన్ని ఎప్పుడైనా సందర్శించారా? గుజరాత్ లోని వడోదరకు దగ్గర్లో అరేబియా సముద్రంలో ఉన్న స్తంభేశ్వర్ మహదేవ్ ఆలయం అటువంటిదే. ఎంతో ధైర్య సాహసాలతో ఈ ఆలయానికి వెళ్లే భక్తులను మహాశివుడు అనుగ్రహిస్తాడని చెబుతారు. భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఇది ఒకటి. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ దేవాలయ సందర్శన సాధ్యపడుతుంది. ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వెళ్తుంది. ఆ సమయంలో భక్తులు వెళ్లి మహాశివుని దర్శనం చేసుకోవచ్చు. మరలా కొన్ని గంటల తరువాత సముద్రం మెల్లగా ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు భక్తులు తిరిగి వెనక్కి వస్తారు.
7. బ్రహ్మ ఆలయం, పుష్కర్, రాజస్థాన్ :
ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దీనిలో భాగంగా రాజస్థాన్ లోని పుష్కర్ ప్రాంతంలో దేవాలయాలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఔరంగజేబు కంట పడినా కూడా నేటికీ చెక్కుచెదరక మనుగడ సాగిస్తున్న దేవాలయాల్లో బ్రహ్మ దేవుని ఆలయం ఒకటి. ప్రపంచంలోని ఏకైక బ్రహ్మ దేవుని ఆలయం ఇదే. హిందూ పురాణాల్లో బ్రహ్మ కూడా ఓ భాగమైనప్పటికీ ఆయనకు ఇక్కడ తప్ప మరెక్కడా గుడి లేకపోవడం విశేషం. పాలరాయితో తయారు చేయబడిన ఈ ఆలయంలో గోడలు వెండి నాణేలతో నిక్షిప్తం చేయబడ్డాయి. ఇవి దాతలు, భక్తుల పేర్లతో కనిపిస్తాయి.
8. దేవరగట్టు ఆలయం, ఆంధ్రప్రదేశ్ :
భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న దేవరగట్టు ఆలయం ఒకటి. కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ ఆలయంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కర్రలను చేతపట్టుకుని అర్ధరాత్రి వరకూఒకరి తలలపై ఒకరు కొట్టుకుంటారు. ఇక్కడి మాల మల్లేశ్వరుడు (శివుడు) చేతిలో రాక్షసుడు హతమైన సందర్భంగా పురుషులు రాత్రంతా తమ రక్తాన్ని చిందిస్తుంటారు. దాదాపు 100 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఇదివరకు లాఠీలకు బదులు గొడ్డలి, బాకులను వాడే వారు.
విచిత్ర దేవాలయాలు
74
previous post