హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల చిట్టాలో మరో ఐఎఎస్ తిమింగలం పేరు వెలుగు చూసింది. వీరిరువురు చేతులు కలిపి చేసిన దందాలు అన్ని ఇన్నీ కావు. ఇలా కోటాను కోట్ల రూపాయలు దిగమింగేశారు. అయితే శివబాలకృష్ణను ఏసీబీ అరెస్టు చేసిన తరువాత విచారణలో పలు నిర్ఘాంతపోయే అంశాలు వెలుగు చూశాయి. ఏకంగా తానే కాకుండా ఇంకో ఉన్నతాధికారి అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం ఒక్కసారిగా గుప్పుమంది. కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు ఇద్దరి అధికారాలను అడ్డుపెట్టి చక్రం తిప్పేశారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు వెలుగు చూశాయి. కన్ఫెషన్ రిపోర్ట్‌లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరును శివ బాలకృష్ణ ప్రస్తావించారు. నేర అంగీకార నివేదికలో బయటపడ్డ వివరాల ప్రకారంశివ బాలకృష్ణ ద్వారా తమకు కావాల్సిన బిల్డింగ్‌లకు అరవింద్ కుమార్ అనుమతులు జారీ చేయించుకున్నారు. నార్సింగిలోని ఒక కంపెనీకి చెందిన వివాదాస్పద భూమికి సంబంధించి శివ బాలకృష్ణ క్లియరెన్స్ ఇచ్చారు. అరవింద్ కుమార్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి ఆయన క్లియరెన్స్ ఇచ్చారు. నార్సింగ్‌లోని ఎస్ఎస్వీ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇవ్వడానికి ఐఏఎస్ అరవింద్ కుమార్ రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. అరవింద్ కుమార్ డిమాండ్ చేసిన రూ.10 కోట్లలో షేక్ సైదా కోటి రూపాయలు చెల్లించారు. గత డిసెంబర్లో బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్‌కు ఆ కోటి రూపాయలు చేరాయి. జూబ్లీహిల్స్‌లోని అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి మరి బాలకృష్ణ కోటి రూపాయలు ఇచ్చారు. అలాగే మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం కూడా అరవింద్ కుమార్ కోటి రూపాయలు డిమాండ్ చేశారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.