చూడటానికి సన్నగా కనిపిస్తాయి గానీ రాగుల్లో క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు దండిగా ఉంటాయి. ఈ చిరుధాన్యాల్లో ప్రోటీన్, పీచుతో పాటు ఖనిజాలు కూడా ఎక్కువే. పైగా కొవ్వు శాతం తక్కువ. మధుమేహులకు, వూబకాయులకైతే రాగులు వరదాయిని అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. వీటిల్లో మన శరీరానికి అవసరమైన ట్రిప్టోథాన్, వాలైన్, మెథియోనైన్, ఐసోల్యూసిన్, థ్రియోనైన్ వంటి అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. వంద గ్రాముల రాగిపిండిని తింటే ఆ రోజుకి మనకు అవసరమైన 350 మి.గ్రా. క్యాల్షియం లభించినట్టే. అలాగే ఐరన్ 3.9 మి.గ్రా.. నియాసిన్ 1.1 మి.గ్రా. థయమిన్ 0.42 మి.గ్రా.. రైబోఫ్లావిన్ 0.19 మి.గ్రా.. కూడా అందుతాయి. ఇలాంటి పోషకాలతో కూడిన రాగులు మనకు ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తాయో చూద్దాం. అధిక బరువు తగ్గటానికి రాగుల్లోని ట్రిప్టోథాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి అదనంగా శరరంలో కేలరీలు పోగుపడకుండా చూస్తాయి. ఇక వీటిల్లోని పీచు కడుపు నిండిన భావన కలిగించి, ఎక్కువగా తినకుండా చేస్తాయి. ఇవన్నీ బరువు తగ్గేందుకు తోడ్పడేవే. ఎముక పుష్టికి వీటిల్లో క్యాల్షియం దండిగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, వృద్ధుల్లో ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. ఎముక క్షీణతను నివారించి విరిగే ముప్పును తగ్గిస్తాయి. మధుమేహం నియంత్రణకు రాగుల్లోని ఫైటోకెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. దీంతో రక్తంలోకి గ్లూకోజు త్వరగా విడుదల కాదు. ఇలా రక్తంలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడతాయి. కొలెస్ట్రాల్ తగ్గేందుకు లెసిథిన్, మెథియోనైన్ అనే అమైనో ఆమ్లాలు కాలేయంలో పోగుపడిన కొవ్వును నిర్మూలిస్తుంది. ఇక థ్రియోనైన్ అమైనో ఆమ్లమైతే కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చూస్తుంది. రక్తహీనత: రాగుల్లోని ఐరన్ రక్తహీనత తగ్గటానికి దోహదం చేస్తుంది. ఆందోళన వీటిల్లోని ట్రిప్టోథాన్ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. అందువల్ల ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యల నివారణకు తోడ్పడతాయి. కొన్నిరకాల పార్శ్వనొప్పులు తగ్గటానికీ ఉపయోగపడుతుంది. కండరాల మరమ్మతుకు ఐసోల్యూసిన్ అమైనో ఆమ్లం కండరాల మరమ్మతుకు, రక్తం ఉత్పత్తికి, ఎముక ఏర్పడటానికి, చర్మం ఆరోగ్యం మెరుగుపడటానికి దోహదం చేస్తుంది. వాలైన్ అమైనో ఆమ్లం జీవక్రియ సరిగా జరగటంలో పాలుపంచుకుంటుంది. కండరాలు సమన్వయంతో పనిచేయటానికి, శరీరంలో నైట్రోజన్ సమతుల్యతకు తోడ్పడుతుంది. వృద్ధాప్యం దూరంగా రాగులను క్రమం తప్పకుండా తింటే పోషణలోపాన్ని దూరంగా ఉంచొచ్చు. వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండానూ చూసుకోవచ్చు.
చిట్టి రాగులు.. గట్టి లాభాలు
103
previous post