138
ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడు మన దేశంలోనే ఉన్నాయి. కాలుష్యం కారణంగా గాలిలో నాణ్యత పడిపోయి నిత్యం అల్లాడిపోయే దేశ రాజధాని ఢిల్లీతోపాటు కోల్కతా, ముంబై కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు స్విస్ గ్రూప్ ‘ఐక్యూ ఎయిర్’ నివేదిక వెల్లడించింది. అంతేకాదు, ఈ జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో రియల్ టైం గాలి నాణ్యత ఈ ఉదయం 7.30 గంటలకు ఏక్యూఐ 483గా ఉంది. రెండో స్థానంలో పాకిస్థాన్లోని లాహోర్ ఉండగా, కోల్కతా మూడో స్థానంలో, ముంబై ఆరో స్థానంలోను ఉన్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, పాకిస్థాన్లోని కరాచీ నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. చైనాలోని షెన్యాంగ్ , హాంగ్జౌ , కువైట్లోని కువైట్ సిటీ, చైనాలోని వుహాన్ వరుసగా 7, 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి.