ఈ నెల 25న ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన మూడు పేజీల లేఖలో చంద్రబాబు పలు అంశాలు ప్రస్తావించారు. రాజమండ్రి జైల్లో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పలు లోపాలు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న తన ప్రాణాలకు ముప్పుగా పరిణమించినట్లు చంద్రబాబు తెలిపారు. సెప్టంబర్ 10న తనను అరెస్టు చేసి 11న రాజమండ్రి జైలుకు రిమాండ్ కు పంపారని, జైల్లోకి తాను ప్రవేశిస్తున్న సమయంలో తనను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆరోపించారు. తద్వారా తన ప్రతిష్టను మంటగలిపారని, అలాగే తన భద్రతకు ముప్పు కలిగించారని చంద్రబాబు తెలిపారు. అలాగే తనను హతమార్చేందుకు ఓ వామపక్ష తీవ్రవాద సంస్ధ కుట్ర పన్నిందని, ఇందుకోసం భారీగా డబ్బు కూడా చేతులు మారినట్లు, ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ కు ఓ లేఖ కూడా అందినట్లు తనకు తెలిసిందని చంద్రబాబు వెల్లడించారు. దీనిపై పోలీసులు అధికారులు ఇప్పటివరకూ స్పందించలేదని, ఆ లేఖపై ఎలాంటి విచారణ కూడా జరపలేదన్నారు. అలాగే ఎన్డీపీఎస్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి పెన్ కెమెరాతో జైల్లో సంచరిస్తూ తోటి ఖైదీల ఫొటోలు తీస్తున్నాడనని తనకు తెలిసిందన్నారు. అలాగే రాజమండ్రి జైలుపై ఓ డ్రోన్ కెమెరా సంచరిస్తూ తమ ఫొటోలు, వీడియోలు తీస్తోందని, అయినా జైలు అధికారులు కానీ, పోలీసులు కానీ దాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జైల్లో గంజాయి ప్యాకెట్లు వస్తున్నాయని, అక్కడ మొత్తం 2200 మంది ఖైదీలుంటే అందులో 750 మంది తీవ్ర ఆరోపణలు ఉన్నవారు ఉన్నారని, ఇవన్నీ తన భద్రతకు ముప్పుగా మారాయన్నారు. ఈ నెల ఆరో తేదీన తనను కలిసి వెళ్తున్న కుటుంబ సభ్యుల్ని మరో డ్రోన్ కెమెరా షూట్ చేసిందని, దీన్ని బట్టి చూస్తుంటే తనతో పాటు కుటుంబానికి కూడా ముప్పు ఉందన్నారు. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో పలు చోట్ల తిరిగిన తనపై అధికార పార్టీ ప్రోద్భలంలో దాడులు జరిగాయన్నారు. జగన్ అధికారంలోకి రాగానే తన భద్రతను తగ్గించారని, హైకోర్టు జోక్యంతో తిరిగి పునరుద్ధరించారన్నారు. 2019 ఆగస్టులో అమరావతిలో బస్సు యాత్ర చేపడితే వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడులకు పాల్పడ్డారన్నారు. అలాగే ఈ ఏడాది ప్రాజెక్టుల వద్దకు తాను వెళ్లినప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారన్నారు. ఈ పరిణామాల్ని అన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి జైల్లో తనకు పూర్తిస్దాయిలో భద్రత కల్పించాలని చంద్రబాబు జడ్జిని కోరారు.
రాజమండ్రి జైలుపై ఓ డ్రోన్
70
previous post