127
రాజస్థాన్‌లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి వెళుతున్న బస్సు అదుపు కోల్పోయి కింద ఉన్న రైలు పట్టాలపై పడటంతో నలుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఈ దారుణం జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన స్థానిక అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో తీవ్రంగా గాయపడిన 28 మందిలో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించామని అదనపు జిల్లా కలెక్టర్ రాజ్‌కుమార్ కస్వా వెల్లడించారు.