పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకే పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. పీవోకే మనదే అన్నారు. భారత్‌లో అంతర్భాగమైన పీవోకేకు 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేసినట్లు స్పష్టం చేశారు. రెండు నయా కాశ్మీర్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్- సవరణ బిల్లు 2023, జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ- సవరణ బిల్లు 2023లను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కశ్మీర్‌లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లుల ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్‌లో గతంలో 46 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 47కు పెంచామని, అలాగే జమ్ములో గతంలో 37 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 43కు పెంచామని తెలిపారు. పీవోకే కూడా మనదేనని, అందుకే ఆ ప్రాంతానికి 24 సీట్లు రిజర్వ్ చేశామన్నారు. భారత తొలి ప్రధాని జనహర్ లాల్ నెహ్రూ చేసిన రెండు పొరపాట్ల కారణంగా జమ్ముకశ్మీర్ దశాబ్దాలుగా బాధపడుతోందని వ్యాఖ్యానించారు. ముందుగా కాల్పుల విరమణ ప్రకటించి, ఆ తర్వాత కశ్మీర్ సమస్యను ఐక్య రాజ్య సమితికి తీసుకెళ్లారని చెప్పారు. ఇది తన తప్పేనని నెహ్రూ చెప్పారని గుర్తు చేశారు. కానీ మన దేశం చాలా భూమిని కోల్పోవడం పెద్ద తప్పు అన్నారు. నెహ్రూపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. వారు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం జమ్ముకశ్మీర్ రిజర్వేషన్- సవరణ బిల్లు 2023, జమ్ము, కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2023 లోక్ సభలో ఆమోదం పొందాయి.
అమిత్ షా లోక్ సభలో కీలక ప్రకటన….
58
previous post