జాతీయ పక్షి నెమళ్లను వేటాడుతున్న వ్యక్తిని జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి పేరే షికార్ అన్న బిరుదును తెచ్చుకున్న ఘరానా హంటర్ అనూహ్య రీతిలో పోలీసులకు చిక్కాడు. గతంలో దుప్పుల వేట కేసులో నిందితునిగా ఉన్నప్పటికి తన పద్దతి మార్చుకోలేదు… నుండి…. ములుగు జిల్లాలో పని చేస్తున్న డీఎస్పీకి ఈయన తండ్రి కావడం మరో విశేషం. జగిత్యాల డిఎస్పీ రము చందర్ ఈ మేరకు మీడియా తో మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం ఐతుపల్లి వద్ద సోమవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా నెమళ్లను వేటాడి తన వాహనంలో తీసుకొస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తిని పట్టుకున్నారని… నిందితుడిని అదుపులోకి తీసుకొని వివిధ కోణాల్లో పోలీసులు విచారించారని…. పెగడపల్లి మండలంలోని దోమలకుంట సమీపంలో నెమళ్లను వేటాడిన వాటిని తీసుకుని తన స్వగ్రామానికి వెల్తుండగా పోలీసుల తనిఖీల్లో రెడ్ హైండడ్ గా పట్టుకున్నారని తెలిపారు.
అదేవిధంగా నిందితుని నుండి 0.22 ఎంఎం ఆయుధం, 34 రౌండ్ల తూటాలు, ఒక గొడ్డలి, కారు స్వాధీనం చేసుకున్నామని… నిందితుడు సత్యనారాయణ గతంలో పెద్దపల్లి జిల్లా బేగంపేట ప్రాంతంలో నివాసం ఉంటూ సింగరేణిలో ఉద్యోగం చేసేవాడని డిఎస్పీ రము చందర్ తెలిపారు… 2017లో రాష్ట్రంలోనే సంచలనం కల్గించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వాయిపేట శివార్లలో దుప్పుల వేట ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి సమయంలో దుప్పులను వేటాడుతున్న క్రమంలో అటవీ అధికారులు దాడులు చేయడం… సినిమా ఫక్కీలో వేటగాళ్లు తప్పించుకోవడంతో వేటకు బలైన దుప్పులను, కారును అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత పోలీసు అధికారులు నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న క్రమంలో షికార్ సత్యం కూడా ఈ కేసులో ఉన్నాడని గుర్తించారు. అప్పుడు భూపాలపల్లి ఉమ్మడి జిల్లాలోనే షికార్ సత్యం తనయుడు సీఐగా పనిచేస్తున్నారు.
బీజేపీ నేత బండి సంజయ్ ఈ కేసును సీరియస్ గా తీసుకుని శాసనసభ పక్ష నేతగా ఉన్న జి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తడంతో పాటు అటవీ అధికారుల తీరుపై కూడా బీజేపీ ఎమ్మెల్యేలంతా ముక్త కంఠంతో ఆరోపించడంతో పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో మహదేవపూర్ ప్రాంతానికి చెందిన వారితో పాటు షికార్ సత్యం కూడా ఉన్నాడని వెలుగులోకి వచ్చింది. తాజాగా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి వద్ద వాహనాల తనిఖీలో జాతీయ పక్షి నెమళ్లను వేటాడి పట్టుకొస్తూ పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో నివాసం ఉంటున్న ఆయన వద్ద అనుమతి లేకుండా వినియోగిస్తున్న తుపాకితో జాతీయ పక్షులను వేటాడుతున్నట్టు తేటతెల్లమైంది. అయితే షికార్ సత్యం తనయుడు పోలీసు విభాగంలో డీఎస్పీ స్థాయిలో పనిచేస్తున్నట్టుగా సమాచారం. ఆయన నక్సల్స్ ఏరివేతలో క్రియాశీలకంగా పనిచేసి ఆక్సిలరీ ప్రమోషన్ పొందాడని పోలీసు వర్గాల సమాచారం.