కుప్పంలో వింత జాతర నేటికీ కొనసాగుతోంది. తమిళుల సాంప్రదాయం ప్రకారం మహా శివరాత్రి పర్వదినం మరుసటి రోజు వచ్చే అమావాస్య రోజున శ్మశానకొళ్లు అనే జాతరను ఘనంగా నిర్వహించారు. కుప్పంలోని శ్మశానవాటికలో మట్టితో అతిపెద్ద అంగాళ పరమేశ్వరి దేవి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూనకం వచ్చిన మహిళలు, యువకులు అంగాళ పరమేశ్వరి చుట్టూ తిరిగి పూజలు చేస్తారు. అనంతరం కొరడాలతో కొట్టించుకుంటే మంచి జరుగుతుందంటూ కొరడా దెబ్బలు తింటారు. ఈ కొరడా దెబ్బలు తినేందుకు భక్తులు పోటీపడడం విశేషం.మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని కుప్పం పట్టణంలోని కొత్తపేటలో వెలసిన శ్రీ ప్రసన్న అంగాళ పరమేశ్వరి జాతరను గ్రామ సాంప్రదాయంగా ప్రతియేటా బెస్త కులస్తులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరను చూసేందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుంచి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి మరుసటి రోజు అమావాస్య పురస్కరించుకొని శ్మశానంలో బెస్త కులస్తులు పూజలు చేపట్టారు.
శ్మశానంలో ఏర్పాటు చేసిన శిలా దేవుని మట్టిబొమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంగాళ పరమేశ్వరి వేషధారణలో భక్తాదులు పూనకంతో ఊగి పోయారు. అంగాళ పరమేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని శ్మశానం వద్దకు తీసుకొని వచ్చి అంగరంగ వైభవంగా పూజలు చేపట్టారు. అనంతరం అక్కడ ఉన్న సమాధులను తవ్వి, బుర్రలను నోట్లో పెట్టుకొని చెరుకు గడ్డలా కరకరమని నమిలారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఎవరికైనా భూత పిశాచి, గాలి, దయ్యాలు పట్టి ఉంటే, ఆలయ పూజారులు కొరడా దెబ్బలతో కొట్టి శ్మశానవాటికలో తరిమి వేస్తారు. ఈ నేపథ్యంలో శ్మశానవాటికలో చాలా మంది యువకులు, పెద్దలు చేతులు చాపి మరి కొరడా దెబ్బలు పూజారుల చేతుల మీదుగా కొట్టించుకున్నారు. అనంతరం పూజ ముగిసిన తర్వాత భక్తులు అక్కడున్న శ్మశానంలో ఏర్పాటుచేసిన శిలా దేవుని విగ్రహ బొమ్మ మట్టిను ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ మట్టిని తమ ఇంటిలో పెట్టుకుంటే దయ్యాలు, భూత, పిశాచులు రావని ఇక్కడ వారి నమ్మకం.