నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో చికెన్ దుకాణాలు మూతబడ్డాయి. దీంతో పేద మధ్య తరగతి ప్రజలకు చికెన్ ముక్క అందని ద్రాక్షలా మారింది. ఇక వీరంతా బంగాళదుంపలనే చికెన్లాగా భావించి, లాగించేయాల్సిన పరిస్థితి. ఇక ఉన్న మహారాజులు మాత్రం ఆదివారం ముక్క లేనిదే ముద్దదిగని వారు, మటన్, చేపలపై పడ్డారు. చికెన్ దుకాణాలు మూతబడటంతో, మటన్, చేపలు, రొయ్యలకు గిరాకీ బాగా పెరిగింది. ఇదే అదునుగా వ్యాపారులు కూడా వాటి రేట్లను పెంచేశారు. దీంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చికెన్ దుకాణాలు వెలవెలబోతుంటే, మటన్, చేపల మార్కెట్లు జనంతో కళకళలాడుతున్నాయి. మటన్ కేజీ వెయ్యి రూపాయలకు పైగా ధర పలుకుతుండగా, చేపలు కిలో 250 రూపాయల వరకు ధర పలుకుతుండటం గమనార్హం. మొత్తం మీద బర్డ్ ఫ్లూ దెబ్బ చికెన్ లభించని పరిస్థితితో ప్రత్యామ్నాయంగా ఉండే మటన్ చేపలు రొయ్యలు నెల్లూరు జిల్లాలో కొండెక్కి కూర్చున్నాయి. చికెన్ దుకాణాల్లో మాత్రం కొనుగోలుదారులు లేక వెలవెలబోతుండడంతో వ్యాపారులు మాత్రం ఒక్క రోజులోనే 50 వేల రూపాయలు నష్టపోయామని వాపోతున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.