కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శవ పరీక్ష గదిలో ఉంచిన మృతదేహానికి చీమలు పట్టడంపై.. బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ బాదితులు రోడ్డు పై బైటాయించి నిరసనకు దిగారు. ఈనెల 29వ తేదీ జమ్మలమడుగు లోని బీసీ కాలనీ లో పదహారేళ్ల బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంతవరకు శవ పరీక్ష నిర్వహించలేదు. పనిచేయని ఫ్రీజర్ లో మృతదేహాన్ని పెట్టడంతో చీమలు పట్టాయి. మంగళవారం బంధువులు వచ్చి మృత దేహాన్ని చూసి ఆవేదనతో ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. ఆసుపత్రి సిబ్బంది నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. పట్టణ ఎస్ఐ సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడారు. ఫ్రీజర్ పనిచేయలేదని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఫీక్ భాష ను వివరణ కోరగా.. ఫ్రీజర్ తెరిచినప్పుడు లైట్లు వెలగడంతో అది పనిచేస్తుందని అనుకుని శవాన్ని అందులో ఉంచారని చెప్పారు. బాధితులు తనకు ఫిర్యాదు చేశారని.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఫ్రీజర్ లో శవానికి చీమలు..
58
previous post