లోక్‌సభ గురువారం నిరవధికంగా వాయిదా పడింది. షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే సభ ముగిసింది. పార్లమెంటు వీతాకాల సమావేశాలు ఈ నెల 4న ప్రారంభమయ్యాయి. గురువారం సభ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లు, ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 13న పార్లమెంటులో భద్రతా వైఫల్యం ఘటన వెలుగు చూసింది. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు దీనిపై ఆందోళన చేశాయి. భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో నిరసనలు తెలిపాయి. ఈ క్రమంలో లోక్‌సభతో పాటుగా రాజ్యసభలో కలిపి మొత్తం 143 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంటు చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో సభ్యులు సస్పెండ్ కావడం ఇదే మొదటిసారి. కాగా ఈ సారి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదించింది. కొత్తగా తీసుకువచ్చిన మూడు క్రిమినల్ చట్టాలు, జమ్మూ, కశ్మీర్ పునర్వవస్థీకరణ బిల్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కమిషనర్ల నియామకం బిల్లు తదితర బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అలాగే టిఎంసి ఎంపి మహువా మొయిత్రాపై సస్పెండ్ సైతం విధించారు. డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణల వ్యవహారంలో దోషిగా నిర్ధారిస్తూ పార్లమెంటు ఎథిక్స్ కమిటీ చేసిన సిఫారసుకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ఆమోదించిన తర్వాత మహువాను లోక్‌సభ బహిష్కరించింది. ముందు నిర్ణయించిన ప్రకారం లోక్‌సభ ఈ నెల 22 వరకు జరగాల్సి ఉంది. అయితే ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా వేశారు.
లోక్‌సభ నిరవధిక వాయిదా
61
previous post