ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లోని తమ కుటుంబ లోక్ సభ నియోజకవర్గాన్ని వదిలి కేరళలో కొత్త స్థావరాన్ని ఏర్పరు చుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పలక్కాడ్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ పెద్ద నాయకుడు ఉత్తర ప్రదేశ్లో తన కుటుంబం ప్రాతినిధ్యం వహించిన సీటును వదిలేశాడు. కేరళలో కొత్త స్థావరాన్ని ఏర్పరుచుకున్నాడు’ అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ 2019 వరకు పలుమార్లు అమేథీ నుంచి గెలుపొందారు. 2019లో బీజేపీ నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ ఆయనను ఓడించి రికార్డ్ సృష్టించారు.
ఇది చదవండి: బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల..!
2019లో అమేథితో పాటు వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ ఈసారీ అక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కేరళలో నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగమైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సహాయాన్ని కాంగ్రెస్ తీసుకుంటోందని మోదీ ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడానికి దేశవ్యతిరేక చర్యలకు పాల్పడిన సంస్థ రాజకీయ విభాగ సంస్థతో కాంగ్రెస్ బ్యాక్ డోర్ ఒప్పందం కుదుర్చుకుందని మండిపడ్డారు. కేరళలో సామాన్య ప్రజలను కష్టాలకు గురి చేసిన కరువన్నూర్ కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణంపై రాహుల్ గాంధీ పెదవి విప్పడం లేదని విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.