దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కి చేరుకుంది. గత 24 గంటల్లో ఏకంగా 640 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో సైతం 3 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కరోనాపై సమీక్షను నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి సంబంధించి ఆయన కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. టెస్టింగ్ లను పెంచడం, ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు జారీ చేయనున్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరింది. తెలంగాణలో సైతం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలు కరోనా బారిన పడ్డారు. నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో వీరికి పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నిర్ధారణ అయింది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మరో 6 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో కొవిడ్ కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన ఒక మహిళలో కొత్త వేరియంట్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించారు డాక్టర్లు. టెస్టింగ్ కోసం పూణెలోని ల్యాబ్ కు పంపారు. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేశారు. సిద్ధిపేటలో కూడా ఒక కేసు నమోదయింది.
Read Also..
Read Also..