ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లా సిల్క్యారా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగా ఉన్నట్లు తేలింది. శిథిలాల నుంచి 53 మీటర్ల మేర చొప్పించిన 6 అంగుళాల పైప్‌లో వాకీటాకీలు జత చేసిన ఎండోస్కోపీ కెమెరాతో రికార్డు చేసిన వీడియోను అధికారులు విడుదల చేశారు. తెల్లవారుజామున తీసిన ఈ వీడియోలో కూలీలు పసుపు-తెలుపు రంగులోని హెల్మెట్లు ధరించి, ఒకరికొరు మాట్లాడుకుంటూ పైప్ నుంచి వచ్చిన ఆహార పదార్థాలను అందుకోవడం కనిపించింది. అధికారులు స్ర్కీన్‌పై గమనిస్తూ, లెన్స్‌ను శుభ్రం చేయాలని, కెమెరా ముందుకు రావాలని కోరారు. పైప్ సమీపానికి వచ్చి వాకీటాకీలో మాట్లాడాలని సూచించారు. తామంతా క్షేమంగానే ఉన్నామంటూ కూలీలు సంకేతాలిచ్చారు. కాగా, ప్రధాని మోదీ కూడా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామికి ఫోన్ చేసి సహాయక చర్యల పురోగతిని తెలుసుకున్నారు. మరోవైపు అధికారులు సొరంగంపై నిలువునా డ్రిల్లింగ్ చేయడంపై దృష్టిసారించారు. దీనికి ఎంత సమయం పడుతుందనేది మాత్రం చెప్పడం లేదు. సొరంగం ముఖద్వారంలో టీబీఎంను వినియోగిస్తున్నారు. చిన్న యంత్రాన్ని వాడేందుకు వీలుగా టన్నెల్ ప్రారంభాన్ని వెడల్పు చేసేందుకు పేలుడు జరపాలని యోచిస్తున్నారు. బార్కోట్ నుంచి మూడు మీటర్ల వ్యాసంతో బ్యాకప్ రూట్ నిర్మాణం ప్రారంభించారు.
Read Also..
Read Also..