ప్రకాశం జిల్లా సత్యవోలు గ్రామంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైంది. 6 వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అపురూపమైన చాళుక్యుల వాస్తుశిల్పం రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిఫలిస్తుంది. ఇది ప్రాచీనతతోబాటు విశిష్టత చాటుకుంటూ ప్రసిద్ధ దేవాలయంగా నిలిచింది. ఈ గుడి గిద్దలూరు పట్టణానికి చాలా దగ్గర్లో ఉంది. గర్భగుడి గోడలకు ఉన్న గూళ్ళలో ఈశ్వరుని విగ్రహం, లింగోద్భవ మూర్తి, దుర్గాదేవి ప్రతిమలు ఉన్నాయి. గర్భగుడి మధ్యభాగంలో రామలింగేశ్వర రూపమైన శివలింగం ఉంది. శిఖరంపై కలశం కనువిందు చేస్తుంది. గుడి చాలా ఎత్తుగా ఉంటుంది. దేవాలయంలో పెద్ద మండపం, గర్భగుడి, అంతరాళం ఉన్నాయి. గుడికి దక్షిణాన నాలుగు చేతులున్న దేవతామూర్తి ఉంది. అంతరాళం శిఖరంపై రాతి కలశం ఉంది. ప్రాచీనతను చాటే మండపంలో నాలుగు స్తంభాలు ఉన్నాయి. వాటిపై అలరించే శిల్పాలున్నాయి. దేవాలయ మధ్యభాగంలో నటరాజ విగ్రహం ఉంది. సత్యవోలు రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఆరు దేవాలయాలు ఉన్నాయి. అన్ని గుడులూ శైవ ఆలయాలే కావడం విశేషం. ఈ దేవాలయాలు అన్నిటిలో పెద్దది భీమ లింగేశ్వరస్వామి ఆలయం. దీని ముఖద్వారం తూర్పుదిక్కుకు ఉంటుంది. మహా మండపానికి మూడు దిక్కులా అంటే తూర్పు, పశ్చిమ, దక్షిణ దిక్కుల గుండా భక్తులు వచ్చిపోయే సౌకర్యం ఉంది. రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని చుట్టుపక్కలవారే కాకుండా, ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో రామలింగేశ్వరస్వామి ఆలయం మరీ కిటకిటలాడుతుంది. సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయ వాస్తు శిల్ప కళ మహానంది ఆలయాన్ని తలపిస్తుంది. మహానంది దేవాలయాన్ని కూడా చాళుక్యులే నిర్మించారు. శైవులైన చాళుక్యులు ఆంధ్రదేశంలో అనేక శివాలయాలను నిర్మించారు.
రామలింగేశ్వర స్వామి దేవాలయం
108
previous post