గత 20 రోజులుగా తమకు న్యాయం చెయ్యాలని ఏపీలో అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. జగన్ కు, వారి ఎమ్మెల్యేలకు ఆడవారి ఉసురు తగులుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. అన్ని వర్గాలకు చెందిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చెయ్యాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పెడితే జనసేన పార్టీ వారికి అండగా నిలుస్తుందన్నారు. అంగన్వాడీల సమస్యలకు పరిష్కారం చూపకుండా ఎమ్మెల్యేలు, ఎంపీల బదిలీల కార్యక్రమంలో నిమగ్నమయ్యారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ESMA ACT
గుంటూరు పట్టణంలో వామపక్ష నేతలు, కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్వాడీల సమస్యలను పరిష్కారించాలని రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం ఎస్మాని విరమించుకోవాలని, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు, వామపక్ష నేతలకు మధ్య వివాదం చోటుచేసుకుంది. అందోళన చేస్తున్న వారిని పోలీసులు స్టేషన్ కి తరలించారు.
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన అంగన్వాడీలకు నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సంఘీభావం తెలిపారు. 2014వ సంవత్సరంలో 4200 ఉన్న అంగన్వాడీ జీతాలను రెండు పర్యాయలుగా పెంచి 10500 చేయడం జరిగిందని తెలిపారు. నాలుగున్నర ఏళ్ళు పరిపాలించిన వైకాపా హయాంలో వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి అంగన్వాడీలను మోసం చేశారన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణం అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవడం లేదని రాజారెడ్డి రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుందని ఎద్దవా చేశారు.
అనంతపురం, గుత్తి పట్టణంలో ఎస్మా చట్టాన్ని రద్దు చేసి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో చేపట్టిన సిపిఐ నాయకులు మరియు అంగన్వాడీ వర్కర్లు. రాస్తారోకో ను అడ్డుకున్న పోలీసులు. సిపిఐ నాయకులను మరియు అంగన్వాడిని వర్కర్ లను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.
అంగన్వాడీ కార్యకర్తలు, సహాయక సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్ఠ అని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరసనలు చేయడం కూడా నేరమా? అని ప్రశ్నించారు. ఎస్మా ప్రయోగం, జీతంలో కోత నియంత పోకడలకు ప్రబల నిదర్శనం అని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం జీవో నెం.2ను వెనక్కి తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అంతిమంగా నెగ్గేది అంగన్వాడీలేనని అన్నారు. ఏపీలో అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపింది. ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జీవో నెం.2 విడుదల చేసింది. గడిచిన 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. సమ్మెలో ఉన్న కాలానికి సంబంధించి వేతనం కట్ చేసింది. నెలనెలా వర్కర్ల ఖాతాలో పడుతున్న రూ. 10 వేల వేతనం స్థానంలో ప్రభుత్వం ఈ నెల రూ.8050 మాత్రమే జమ చేసింది. ఎస్మా అంటే..ది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటనెన్స్ యాక్ట్ కు సంక్షిప్త రూపమే ఎస్మా.. ప్రజల సాధారణ జీవనం సాఫీగా సాగేందుకు తోడ్పడే సర్వీసులకు భంగం కలగకుండా ఈ చట్టం ఉపయోగపడుతుంది. వైద్యం, ప్రజా రవాణా వంటి అత్యవసర సేవలు అందించే రంగాలలోని సిబ్బంది సమ్మెల పేరుతో విధులకు గైర్హాజరు కాకుండా ప్రభుత్వం ఈ చట్టం ప్రయోగించవచ్చు.
Read Also..
ఏపీ రాష్ర్ట వ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు మిన్నంటాయి. పలు చోట్ల అంగన్వాడీలు తమ నిరసనలను ఉదృతం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోనూ.. అంగన్వాడి కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఒంటికాలతో నిలబడి నిరసనలు చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఇప్పటికైనా వైయస్ జగన్ తమ సమస్యలను తెలుసుకొని తాము పడుతున్న బాధలను, కష్టాలను గమనించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Read Also..






Total views : 78739