సైబర్ నేరస్థులు కొత్తరకం మోసాలకు తెరలేపారని, అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో అభయ హస్తం దరఖాస్తుదారులను టార్గెట్ చేసుకుని సైబర్ అటాక్స్ జరుగుతున్నాయని హెచ్చరించారు. దరఖాస్తుదారులకు ఫేక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. అభయ హస్తం దరఖాస్తులకు కేటుగాళ్లు ఫోన్ చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, గ్యాస్ సిలిండర్ మంజూరైందని చెబుతారని వివరించారు. దరఖాస్తులో పేర్కొన్న వివరాలను చెప్పి నమ్మిస్తారని, ఆపై ఫోన్ కు ఓటీపీ వచ్చిందని, ఆ నెంబర్ చెప్పాలని అడుగుతారన్నారు. పథకం వచ్చిందని నమ్మి ఓటీపీ చెబితే మీ ఖాతాలోని సొమ్ము మాయం అవుతుందని హెచ్చరించారు. మొబైల్ ఫోన్ కు వచ్చే ఓటీపీలను ఎవరికీ షేర్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి అభయ హస్తం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలుకోసం ఈ అప్లికేషన్లు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రోజుల పాటు నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొత్తంగా 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ప్రస్తుతం సైబర్ నేరస్థులు కన్నేశారని పోలీసులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి, బ్యాంకు ఖాతాలోని సొమ్మును కాజేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
Read Also..