హైదరాబాదులోని బేగంపేట ప్రజాభవన్ బారికేడ్లను కారు ఢీకొన్న ఘటన మరో మలుపు తిరిగింది. ఈ ఉదంతం వెనకబోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహుల్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న అర్ధరాత్రి ఓ కారు ప్రజాభవన్ వద్ద ఉన్న బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అతివేగంతో కారు నడుపుతూ ప్రజాభవన్ వద్ద బారికేడ్లను బలంగా ఢీకొట్టాడు. ఘటన జరిగిన సమయంలో కారులో ముగ్గురు యువతులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారమిచ్చి సాహిల్‌తో పాటూ ముగ్గురు యువతులను అప్పగించారు. అయితే, బ్రీత్ ఎనలైజర్ ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉండటంతో ఇన్స్పెక్టర్ దుర్గారావు సాహిల్‌ను హోంగార్డుకు అప్పగించి డ్రంకన్ డ్రైవ్ పరీక్షకు పంపించారు. ఈ సమయంలో నిందితుడు తప్పించుకున్నాడు. అనంతరం, సాహిల్ దుబాయ్‌లో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన సూచనతో అనుచరులు సాహిల్‌ను తప్పించి వారి పనిమనిషి అబ్దుల్ ఆసిఫ్‌ను పంజాగుట్ట ఠాణాకు తీసుకెళ్లారు. కారు తానే నడిపినట్టు అతడితో చెప్పించడంతో కేసు నమోదైంది. అయితే, ముగ్గురు యువతులను స్టేషన్‌కు రప్పించి వాంగ్మూలం తీసుకున్నప్పుడు కారు నడిపింది సాహిల్ అని వెలుగులోకొచ్చింది. ఈ క్రమంలో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును కేసులో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బారికేడ్లను ఢీకొన్న ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ప్రధాన నిందితుడని పశ్చిమ మండలం డీసీపీ తెలిపారు. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు పనిమనిషిని ఠాణాకు పాంపారన్నారు. సాంకేతిక ఆధారాలు సేకరించాక అసలు విషయం బయటపడిందన్నారు.
మరో మలుపు తిరిగిన ప్రజాభవన్ యాక్సిడెంట్ కేస్
47
previous post