నవంబర్ 30న పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి సి.హెచ్.మధుమోహన్ అన్నారు.
పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లపై పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి సి.హెచ్. మధుమోహన్ పత్రికా సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి మధుమోహన్ మాట్లాడుతూ….. నవంబర్ 28న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగిస్తుందని, ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం పెద్దపల్లి నియోజక వర్గంలో పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుంచి అనగా నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ పాటించాలని తెలిపారు.
స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్లి పోవాలని, హోటల్లలో, ఫంక్షన్ హాల్ లో ఉండి ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని , సైలెన్స్ పీరియడ్ 48 గంటల వరకు మద్యం షాపులు మూసి వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
సైలెన్స్ పిరియడ్ లో ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్, నాయకుల ఇంటర్వ్యూ, ఎన్నికల చర్చలు, ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలులేదని, నవంబర్ 29, 30న పత్రికలలో ఎన్నికలకు సంబంధించిన ప్రకటనల జారీ కోసం ముందస్తుగా జిల్లా కేంద్రంలోని ఎం.సి.ఎం.సి. అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.
నవంబర్ 29న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అప్పగించి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామని, అవసరమైన మేర సెక్టార్ అధికారులను నియమించామని అన్నారు.
నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, పోలింగ్ అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి పోలింగ్ సిబ్బంది, ఈవిఎం యంత్రాలు, వివిప్యాట్ లను తరలిస్తారని, నవంబర్ 30న రాత్రి సమయంలో పోలీస్ ఎస్కార్ట్ తో కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎం యంత్రాలు, వివి ప్యాట్లను తరలించడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన మేర భద్రత ఏర్పాట్లు చేశామని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వెలెన్స్ బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నాయని అన్నారు.
పెద్దపల్లి లో పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అవసరమైన వసతులు కల్పించడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేశామని, త్రాగునీటి సౌకర్యం , ఓటరు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు . పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 575 మంది వృద్దులు, దివ్యాంగుల ఓట్లు ఇంటి నుంచి సేకరించామని అన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 159 లోకేషన్లలో 290 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 32 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, 12 వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకారం అందించాలని ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన కోరారు.