దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. 11 మంది దోషుల ముందస్తు విడుదల చెల్లదంటూ గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది. దోషులను ముందస్తుగా విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. ఈమేరకు జస్టిస్ బీవీ. నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాధితురాలు బిల్కిస్ బానోకు ఊరట కలిగించేలా తీర్పు చెప్పింది. 2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. బానో ఇంట్లోకి చొరబడిన పలువురు దుండగులు ఆమెపై అత్యాచారం చేసి, మూడేళ్ల కూతురితో పాటు ఇంట్లో అందరినీ చంపేశారు. ఈ దారుణంపై బిల్కిస్ బానో సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేశారు. నిందితుల అరెస్టు నుంచి వారికి శిక్ష పడేంత వరకూ పోరాడారు. నేరం రుజువు కావడంతో నిందితులకు కోర్టు మరణ శిక్ష విధించింది. దీనిపై నిందితులు అప్పీల్ చేసుకోవడంతో యావజ్జీవ శిక్షకు మార్చింది. అయితే, ఈ కేసులో మొత్తం పదకొండు మంది దోషులను గతేడాది గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేసింది. 1992 చట్టం ప్రకారం 14 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకోవడంతో పాటు జైలులో సత్ర్పవర్తనతో మెలిగారని పేర్కొంటూ స్వాతంత్ర దినోత్సవం రోజు బయటకు పంపింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. బాధితురాలు మరోమారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సహా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, జర్నలిస్ట్ రేవతి లాల్, లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రూప్ రేఖా వర్మ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు గతేడాది అక్టోబర్ లో తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా తీర్పు వెలువరించిన కోర్టు దోషుల ముందస్తు విడుదల చెల్లదని తేల్చి చెప్పింది.
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పు..
90
previous post