భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా ఆమె మనవడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగ వీడియోను షేర్ చేశారు. 1984లో ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత ఆమె పార్థివదేహం వద్ద రాహుల్ గాంధీ కన్నీటిపర్యంతమవుతున్న దృశ్యాలతోపాటు, ఇందిరాగాంధీ ప్రజలతో మమేకమైన సందర్భాలు, ఐక్యరాజ్యసమితిలో ఆమె ప్రసంగించేందుకు వెళుతుండటం వీడియోలో చూడొచ్చు. నానమ్మ నా శక్తి నువ్వే.. భారత్ కోసం నువ్వు సర్వస్వం త్యాగం చేశావు. ఈ దేశాన్ని నేను ఎప్పటికీ కాపాడుతుంటాను. నీ జ్ఞాపకాలు నా గుండెల్లో ఎప్పటకీ నాతోనే ఉంటాయి అని రాహుల్ ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు శక్తి స్థల్లో ఇందిరా గాంధీకి నివాళులు అర్పించారు. శక్తిమంతమైన, ప్రగతిశీల భారత దేశాన్ని నిర్మించడంలో ఇందిరా గాంధీ కీలక పాత్ర పోషించారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆదర్శాలను పాటిస్తూ, ధైర్యంగా జీవిస్తూ.. న్యాయం కోసం పోరాటం చేయాలనేందుకు మీ జీవితం నిదర్శనం అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఇందిరా గాంధీ మరో మనవడు, భాజపా ఎంపీ వరుణ్ గాంధీ కూడా ఆమెకు నివాళులు అర్పించారు. “ధైర్యానికి, పోరాటానికి ప్రతీక. ఓ వైపు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనే సంకల్పం, మరోవైపు మాతృత్వంలో సున్నితత్వం. మీరు నిజంగా మదర్ ఆఫ్ ది నేషన్ అని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.
నానమ్మ నా శక్తి నువ్వే.. రాహుల్ గాంధీ
105
previous post