గుండె ఆరోగ్యంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని మరోసారి రుజువైంది. నువ్వులనూనె, తవుడునూనె కలిపి వాడితే అధిక రక్తపోటు తగ్గుతున్నట్టు మనదేశంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అధిక రక్తపోటు బాధితులకు పక్షవాతం, గుండెజబ్బు ముప్పు ఎక్కువన్నది తెలిసిందే. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో భాగంగా సుమారు 40 గ్రాముల మేరకు నువ్వులనూనె, తవుడునూనె కలిపి తీసుకుంటే.. రక్తపోటు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ తగ్గుదల రక్తపోటు తగ్గటానికి వేసుకునే మందులతో (క్యాల్షియం ఛానెల్ బ్లాకర్స్) సమానంగా ఉండటం గమనార్హం. కేవలం మందులు వేసుకునేవారితో పోలిస్తే.. మందులతో పాటు నూనెల మిశ్రమాన్ని వాడినవారిలో రక్తపోటు రెండు రెట్లు తగ్గటం విశేషం. ఈ నూనెల మిశ్రమంతో చెడ్డ (ఎల్‌డీఎల్) కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటు మంచి (హెచ్‌డీఎల్) కొలెస్ట్రాల్ పెరుగుతోందనీ పరిశోధకులు చెబుతున్నారు. నువ్వుల నూనె రక్తపోటుపై గణనీయమైన ప్రభావం చూపుతుందని, ఇది కూడా క్యాల్షియం ఛానెల్ బ్లాకర్ మందుల్లా ప్రభావం చూపుతుందని గతంలో తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ దేవరాజన్ శంకర్ పేర్కొంటున్నారు. అయితే దీనికి తవుడు నూనె కూడా తోడైతే మరింత మంచి ఫలితం కనబడుతోంది. నువ్వులనూనెలోని సీసమిన్, సీసమోల్, సీసమోలిన్.. తవుడునూనెలోని ఓరీజనోల్ అనే యాంటీఆక్సిడెంట్లు ఇందుకు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ రెండు నూనెలూ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (మంచి కొవ్వులు) కలిగున్నాయంటున్నారు.
రక్తపోటుకు ‘నూనెల’ కళ్లెం!
106
previous post