2024 ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. జాతరలో పారిశుధ్యం, రహదారులు, విద్యుత్తు, తాగునీటి లభ్యత, స్నానాల ఏర్పాట్లు, భక్తుల వసతులు తదితర అంశాలవారీగా సంబంధిత అధికారులతో చర్చించి తగు ఆదేశాలిచ్చారు. క్రితం జాతరకు రెండు నెలల ముందే జరిగిన కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈ సారి జాతర సమయంలోనే జరిగేటట్లు చూడాలని, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సితక్క మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపి మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి చేద్దామని, తద్వారా రాష్ట్ర బడ్జెట్ కు కేంద్ర నిధులు తోడై జాతరను మరింత ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు. వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటీడీఏ అధికారులు అందరితో సమీక్ష నిర్వహించి జాతర పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ తన తల్లి వంటిదని, ఈ శాఖ ఉద్యోగులు తనను సోదరిలా భావించి తమ సమస్యలను ఎప్పుడైనా చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు.