శ్రీసిటీ ఆధ్యాత్మిక, సాహిత్య వేదిక ‘శ్రీవాణి’ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శనివారం శ్రీసిటీ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బిజినెస్ సెంటర్ లో నిర్వహించిన ప్రఖ్యాత కవయిత్రి, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రగాఢ భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి సాహిత్య స్వరాంజలి కార్యక్రమం సంగీత, సాహిత్య ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ డా. సాయికృష్ణ యాచేంద్ర, టీటీడీ శ్వేతా మాజీ డైరెక్టర్ భూమన్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య భూమన కుసుమ కుమారి, వెంగమాంబ రీసెర్చ్ స్కాలర్ గంధం శంకర్రావు ముఖ్య అతిధులుగా పాల్గొనగా, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికారు.
జ్యోతి ప్రజ్వలన, కుమారి మల్లాది అనూష ప్రార్ధనా గీతంతో ప్రారంభమైన కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ జీవిత విశేషాలు, శ్రీవారిపై ఆమె సాహిత్యం, విశిష్ట శైలి గురించి భూమన్, భూమన కుసుమ కుమారి, శంకర్రావు తమ ప్రసంగంలో వివరించారు.
ప్రముఖ విద్వాంసులు, స్వరకర్త, గాయకులు, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) చైర్మన్, వెంకటగిరి వెలుగోటి రాజకుటుంబ వారసుడు డాక్టర్ వెలుగోటి భాస్కర సాయికృష్ణ యాచేంద్ర చేసిన తరిగొండ వెంగమాంబ కీర్తనల స్వరకల్పనలో గాయకులు కొన్నింటిని రాగయుక్తంగా ఆలపించారు.
డా.కుసుమ కుమారి మాట్లాడుతూ ‘వెంకటాద్రి మహిమ’ పురాణం నుంచి ‘ద్వీపద భాగవతం’ వరకు ఆమె రచనలు సరళత, స్పష్టత, ప్రగాఢ భక్తితో ప్రతిధ్వనిస్తాయన్నారు. శ్రీవేంకటేశ్వరునిపై ఆమెకున్న అమోఘమైన విశ్వాసం ‘ముత్యాల హారతి’లో వ్యక్తమైందని, ఇది నేటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచరిస్తున్నట్లు తెలిపారు.
తిరుమలలో ఆచరిస్తున్న ఈ రోజువారీ సేవ, వెంగమాంబ ఆధ్యాత్మిక వారసత్వానికి శాశ్వత నివాళిగా ఆమె పేర్కొన్నారు.
వెంగమాంబ రచనలకపై డా. యాచేంద్ర స్వరకల్పన చేసిన ‘ఆడినే శివుడాడీనే’, ‘ఏమి తపము చేసివమ్మా’, ‘ఆడెనే బాలకృష్ణుడు ఆడెనే’, ‘బ్రహ్మదేవుడొచ్చెను’, మరికొన్ని పాటలను యువ గాయకులు మల్లాది అనూష, పవిత్ర, శివ శ్రవణ్, నరేష్ కూడా కొన్ని పాటలను ఆలపించారు.
వీరికి వాయిద్య కళాకారులు బాబు (కీబోర్డు), వెంకట్రావు (తబలా), నటరాజ్ (ఫ్లూట్), చిల్లర సుబ్రమణ్యం (తాళం), శంకర్రావు (వ్యాఖ్యాత) అద్భుతమైన సహకారాన్ని అందించారు.
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, శ్రీవాణి ప్రథమ వార్షికోత్సవానికి వచ్చిన అతిథులందరికీ సాదరంగా స్వాగతం పలికి, శ్రీవాణి ద్వారా ఏడాదిగా నిర్వహిస్తున్న వివిధ భక్తిమయ, సంగీత, సాహిత్య ప్రదర్శనలు మరియు సంగీత సాహిత్య ప్రియులను అవి ఎలా ఆకట్టుకుందో వివరించారు.
వెంగమాంబ స్వరాంజలి కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ యాచేంద్ర, భూమన్, డా. కుసుమ కుమారి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, గతంలో అన్నమయ్య సంకీర్తనావళి తరహాలో ఈ కార్యక్రమం కూడా శ్రీవాణి ద్వారా శ్రీసిటీయేతర ప్రాంతాలకు విస్తరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, తరిగొండ వెంగమాంబ (1730-1817) తన జీవితాన్ని వెంకటేశ్వర స్వామికి అంకితం చేసింది. ఆమె ఔత్సాహిక కవులకు స్ఫూర్తిదాయకంగా, భక్తులలో నమ్మకం, విశ్వాసం నింపే మార్గదర్శిగా మిగిలింది. ఆమె జీవితం మరియు రచనలలోని గొప్పదనం భగవంతుడు, మానవాడు మధ్య కళల యొక్క సామర్థ్యాన్ని ఒక వంతెనలా మనకు గుర్తు చేస్తాయి.
వెంగమాంబ మనోహరమైన భక్తిమయ రచనలు, చిరస్థాయిగా కొలువుండేలా భక్తుల హృదయాలలో ఆమె సుస్థిరస్థానం పొందింది. ఈమె రచనలలో యక్ష గానాలు, ఆధ్యాత్మిక గేయాలు, పద్యకృతులు, పద్యకావ్యాలు, ద్విపదకావ్యాలు, తాత్విక కావ్యాలు వంటి వివిధ సాహితీ ప్రక్రియలు దర్శనమిస్తాయి. తాత్విక కావ్యాలలో రాజయోగామృతసారం గొప్ప పేరు పొందింది.
శ్రీసిటీ పీఆర్‌వో పల్లేటి బాలాజీ పర్యవేక్షణలో సాగిన ఈ కార్యక్రమంలో శ్రీసిటీ పరిసర ప్రాంతాలతో పాటు శ్రీహరికోట, చెన్నై, నెల్లూరు, సూళూరుపేట ప్రాంతాలకు చెందిన పలువురు పాల్గొన్నారు.