నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గం.లింగసముద్రంలో బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం. ఓటమి భయంతో వణికిపోతున్న జగన్. జనం తంతారని వైసీపీ వాళ్ళకి అర్థమైపోయింది. చంద్రబాబుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం. తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిదే అంతిమ విజయం.
తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం లింగసముద్రం గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి, ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం హాజరయ్యారు. పార్టీ నేతలు ప్రతి ఇంటికి తిరుగుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాల గురించి వివరించారు.
నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి కథ కంచికి చేరిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో 99% నెరవేర్చలేదని, బూటకపు వాగ్దానాలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అలాగే ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, మహిళలు, యువత. ఇలా ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి చంద్రబాబునాయుడు గారు పథకాలు అమలు చేస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని బాలాజీ తెలిపారు. కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడం, ఏషియన్ పేపర్ పరిశ్రమ ఏర్పాటు కానియకుండా అడ్డుపడడం లాంటి విషయాలను కందుకూరు ప్రాంత ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని, రాబోయే ఎన్నికల్లో వైసిపికి గుణపాఠం తప్పదని బాలాజీ చెప్పారు. ప్రజలంతా మెచ్చే విధంగా భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆరు పథకాలను ప్రకటించారని, ప్రతి ఒక్కరూ తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి తెలుగుదేశం పార్టీకి తప్పకుండా మద్దతు పలకాలని బాలాజీ కోరారు.
ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదన్న విషయం జగన్ మోహన్ రెడ్డికి, ఆ పార్టీ నేతలకు మూడు నెలలు ముందుగానే అర్థమైందన్నారు. ప్రజలకు ఇసుమంత కూడా మేలు చేయకుండా, కేవలం డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారన్న భ్రమలో జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నారని విమర్శించారు. అదే ప్రజలు తిరగబడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈపాటికి జగన్ కు తెలిసిందని, వైసీపీ దుకాణం మూతబడినట్టేనని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వెనుకబడిన లింగసముద్రం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ముఖ్యంగా రాళ్లపాడు రిజర్వాయర్ విషయంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, రైతులకు సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామన్నారు. ఈసారి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించాలని నాగేశ్వరరావు అభ్యర్థించారు. అంతకుముందు లింగసముద్రం గ్రామానికి విచ్చేసిన పార్టీ నేతలకు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా, చంద్రబాబు ప్రకటించిన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, యువ గళం, రైతుకు ఆర్థిక సహాయం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, బీసీలకు రక్షణ చట్టం తదితర పథకాల గురించి వివరిస్తూ షూరిటీ బాండ్లను అందజేశారు.