అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ముక్కు పచ్చలారని చిన్నారిని నిమ్మకాయ బలిగొంది. ఈ సంఘటన పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గోవిందరాజు, దీప దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఏడేళ్ల తరువాత చిన్నారి జస్విత (9 నెలలు) జన్మించింది. చిన్నారి బుధవారం సాయంత్రం ఆడుకుంటూ ఉన్నట్టుండి నిమ్మకాయ నోట్లో పెట్టుకుంది. గొంతులో ఇరుక్కుపోయిన నిమ్మకాయను తీయడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో పెద్దవడుగూరులోని ప్రైవేటు క్లినిక్కు తీసుకెళ్లారు. అక్కడా వీలు కాలేదు. దీంతో 108 వాహనంలో అనంతపురం తీసుకెళుతూ మార్గమధ్యంలోని పామిడిలో ఓ ప్రైవేటు డాక్టర్ వద్ద చూపించారు. అప్పటికే చిన్నారి శ్వాస ఆగిపోయిందని డాక్టర్ తెలపడంతో అక్కడి నుంచి పామిడి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.
Read Also..