తిరుమలలో శ్రీరామకృష్ణ ముక్కోటి తీర్థంను టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో ఈ తీర్థం వెలసి ఉంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థముక్కోటిని ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించడం అనవాయితీ. భారీ స్థాయిలో భక్తులు రామకృష్ణ తీర్థ ముక్కోటిలో పాల్గొన్నారు. స్కంద పురాణం ప్రకారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నారు. ఈ తీర్థ తీరంలో నివసిస్తూ స్నానపానాదులు చేస్తూ, శ్రీమహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారు. విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు. ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించడం వల్ల అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించడం వల్ల కలిగే దోషాల నుండి విముక్తి లభించి, సుఖంగా జీవించగలరని ప్రాశస్త్యం. ఉదయం 7.30 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ్లారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
తిరుమలలో వైభవంగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి..
81
previous post