దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలు అంబరాన్నంటాయి. పరేడ్ లో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు ప్రదర్శించిన శకటాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తూ భారత్ సాధించిన చంద్రయాన్-3 విజయం నుంచి అయోధ్యలో ఇటీవల కొలువైన బాల రామయ్య వరకూ అనేక విశేషాలను వీటిల్లో ప్రదర్శించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ISRO ప్రదర్శించిన శకటంలో చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 మిషన్లు ఆకట్టుకున్నాయి. చంద్రుడిపై మన విక్రమ్ ల్యాండర్ దిగుతున్న దృశ్యాలను ఇందులో ప్రదర్శించారు. శకటంపై ఉన్న మహిళా శాస్త్రవేత్తలు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్‌ను చూపించారు. ఉత్తరప్రదేశ్ శకటంలో రామ్ లల్లా చిత్రం ఆకట్టుకుంది. అయోధ్యలో నవనిర్మిత భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి గుర్తుగా దీన్ని ప్రదర్శించారు. శకటానికి ముందు బాలక్‌రామ్ విల్లు-బాణంతో దర్శనమిచ్చారు. ఈ పరేడ్‌లో తెలుగు రాష్ట్రాల శకటాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అమర వీరులను స్మరించుకునేలా తెలంగాణ శకటాన్ని తీర్చిదిద్దారు. దీనికి ‘జయ జయహే తెలంగాణ’గా నామకరణం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పల్లవితో ప్రజాకవి అందెశ్రీ రాసిన గీతం విశేష ప్రాచుర్యం పొందింది. శకటంలో కుమురం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల విగ్రహాలతో పాటు రాష్ట్ర కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యారంగం థీమ్‌తో ఏపీ శకటాన్ని ప్రదర్శించారు.
అంతరిక్ష రంగంలో చరిత్రను లిఖిస్తున్న భారత్
76