బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు. 2 లక్షల 86 వేల 389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన సుదీర్ఘంగా ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమని, రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్నీ విస్మరించకూడదన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐదేళ్ల కిందట తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు.
రాష్ట్రంలోని బీసీల సంక్షేమానికి జగన్ ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. బీసీ సంక్షేమం కోసం రాష్ట్రంలో 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, బీసీల కోసం రూ. 71,170 కోట్లు ఖర్చు చేశామని మంత్రి బుగ్గన తెలిపారు. ఇళ్లు లేని పేదలకు ఐదేళ్లలో తమ ప్రభుత్వం 30.65 లక్షల ఇళ్ల పట్టాలు అందించినట్లు వివరించారు. తమ హయాంలో రూ. 2.53 లక్షల కోట్ల నగదు బదిలీ చేశామని చెప్పారు. వైఎస్సార్ పెన్షన్ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచి, రాష్ట్రంలోని 66.35 లక్షల మందికి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఈ ఐదేళ్లలో రూ. 84,731 కోట్లు వెచ్చించినట్లు మంత్రి వివరించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం తలసరి ఆదాయంలో తొమ్మిదో స్థానంలో ఉందని తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.