ప్రముఖ న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ కన్నుమూశారు. ఈ ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నారీమన్ వయసు 95 సంవత్సరాలు. ఆయన మరణం పట్ల ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. న్యాయ రంగంలో చేసిన సేవలకు గాను నారీమన్ ను భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. బాంబే హైకోర్టు లాయర్ గా నారీమన్ తన కెరీర్ ను ప్రారంభించారు. 1972లో ఆయన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. అయితే, అప్పటి ప్రధాని ఇంధిరాగాంధీ ఎమర్జెన్సీని విధించడంతో… ఆ చర్యను వ్యతిరేకిస్తూ ఆయన 1975లో సొలిసిటర్ జనరల్ పదవికి రాజీనామా చేశారు. నారీమన్ మృతితో ఒక యుగం ముగిసిందని కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వ తెలిపారు. న్యాయ రంగం, ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో నారీమన్ చిరస్థాయిగా నిలిచిపోతారని సింఘ్వీ అన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.