జమ్మలమడుగు (Jammalamadugu) :
జమ్మలమడుగు (Jammalamadugu)లో సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు ఇన్చార్జ్ భూపేష్ సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి బరిలో ఉన్నారు. కానీ పొత్తులలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తారని, ఈ స్థానం నుండి భూపేష్, బాబాయ్ ఆదినారాయణ రెడ్డి పోటీలో ఉంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఆత్మీయ సమ్మేళనం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గస్థాయిలో దేవగుడి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. తమ కుటుంబం వైకాపాలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న కేవలం అభివృద్ధిని మాత్రమే కోరుకున్నదని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తాను ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని గద్దె దింపాలని సంకల్పించుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశానని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు కేవలం ఒకడిని మాత్రమేనని కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం తన వైపు వచ్చిందని ఒక్కడితో ప్రారంభమైన ఈ యాత్ర ఇంతమందితో కదలి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని జగన్మోహన్ రెడ్డి ని ఇంటికి పంపాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గంలో నిర్మించిన అన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తాము నిర్మించినవేనని అన్నారు. ఈ గాలివాటపు సుడిగాలి సుధీర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించాలంటే కూడా పోలీసులను వెంటవేసుకొని దేవగుడి గ్రామానికి వచ్చి నివాళులు అర్పిస్తాడని.. కానీ సొంత ఊర్లో వైఎస్సార్ విగ్రహాన్ని నిర్మించుకోలేదని ఎద్దేవా చేశాడు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన భాష మార్చుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో తమ కుమారుడు భూపేష్ నిర్ణయమే చివరిదని ఆయన నిర్ణయం ప్రకారమే తామందరూ నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా నారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి