కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం (Kondagattu anjaneya Swamy) లో తవ్విన కొద్దీ బయటపడుతున్న అక్రమాలు….
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం (Kondagattu anjaneya Swamy) లో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపైనే ప్రధానంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ నిధుల దుర్వినియోగంపై దేవాదాయశాఖ అదనపు కమిషనర్ జ్యోతి ఆడిటింగ్ నిర్వహించగా.. ఆడిటింగ్‌లో మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి. దాదాపు నెల క్రితం సీనియర్ అసిస్టెంటుగా పనిచేసిన ఓ ఉద్యోగి అంజన్న ఆలయ ఆవరణలో లీజు కింద దుకాణాల కోసం వ్యాపారుల నుంచి 37 లక్షల 90 వేల రూపాయలు వసూలు చేసి.. ఆలయ ఖాతాలో జమచేయకుండా సొంత ఖాతాలో వేసుకోవడం కలకలం రేపింది. దాంతో సదరు ఉద్యోగిని ఆలయ అధికారులు సస్పెండు చేసి.. మల్యాల పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగం విషయమై నిర్వహించిన తాజా ఆడిటింగ్ లోనూ సదరు ఉద్యోగి 14 లక్షల 49 వేల దుర్వినియోగానికి పాల్పడ్డట్లు తేలడంతో.. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు అతడికి మెమో జారీ చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఆడిటింగ్ లో బట్టబయలైన లక్షల వ్యవహారం…
గతంలోనూ ఆడిటింగ్‌లో అధికారులకు 2018-19 సంవత్సరానికి సంబంధించిన.. మరో 16 లక్షల 50 వేల రూపాయలు నిధుల స్టాక్ రిజిస్టర్లు లేకపోవడంతో దుర్వినియోగమైనట్లు గుర్తించారు. కొండగట్టులో వివిధ దుకాణాలకు.. లీజు హక్కులు కట్టబెట్టడానికి అధికారులు ఏటా టెండర్లు నిర్వహిస్తారు. టెండర్లలో దుకాణం లీజు హక్కులు దక్కించుకున్న వ్యాపారులు ఆలయానికి చెల్లించాల్సిన మొత్తంలో టెండర్ నిబంధనల ప్రకారం టెండర్ నిర్వహించిన సదరు వ్యాపారి నుంచి 50 శాతం ముందుగానే నగదు లేదా చెక్కు ద్వారా వసూలు చేయాల్సి ఉంటుంది. దుకాణం నడుపుకునే వ్యాపారుల నుంచి నిర్ణీత గడువు ముగిసేలోపు మిగిలినడబ్బులను వసూలు చేయాల్సిన బాధ్యత.. సదరు సెక్షన్ లో ఉండే ఉద్యోగిపై ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో కొందరు ఆలయ అధికారులు, సిబ్బంది వ్యాపారులతో సఖ్యతగా ఉంటుండటంతో.. డబ్బులు ఆలస్యంగా చెల్లించినా పట్టించుకోకపోవడంతో… వ్యాపారులు సకాలంలో ఆలయానికి డబ్బులు చెల్లించకుండా కొంతమంది చేతులెత్తేశారు. ఇంత జరుగుతున్నా.. ఈవో వెంకటేశ్వర్ల పర్యవేక్షణ కరువవ్వడంతో… దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కొండగట్టు ఈవో టంకశాల వెంకటేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తరులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో ఈవో వెంకటేశ్ ను.. కరీంనగర్ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో ఉండాలని.. సమాచారమివ్వకుండా ఎక్కడి వెళ్లకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు.
కొండపైనేం జరిగినా పట్టించుకునేవారేరీ..?
కొండగట్టు కొండపైనేం జరుగుతుందో పట్టించుకునేవారుండరు. దీంతో ఇక్కడ అధికారులు ఆడిందాట, పాడింది పాట అన్నచందంగా పరిస్థితి తయారైంది. మొత్తంగా అంజన్న కోసం ఇతర రాష్ట్రాల నుంచీ కూడా కాలినడకన వచ్చే బాటసారులు.. మొక్కుల రూపంలో తీర్చుకునేవి.. మరోవైపు ఆలయ నిర్వహణలో ఉన్న దుకాణాల లీజుకు సంబంధించిన డబ్బులెటు పోతున్నాయో ఆ అంజన్నకే అర్థం కాని రేంజులో ఇక్కడ అధికారుల తీరుండటం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
ఇది చదవండి: ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన బస్సు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి