రాష్ట్రంలో రాజకీయపార్టీల, ప్రజాసంఘాల నాయకులపై కార్యకర్తలపై ఇటీవల పెడుతున్న పోలీసు కేసులలోని వాస్తవాల నిజనిర్ధారణ కోసం ఒక త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేస్తూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ నిర్ణయం తీసుకున్నది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యవర్గ సమావేశం తిరుపతిలో శనివారం సంస్థ అధ్యక్షులు , ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి. భవానీ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఇటీవల రాష్ట్రంలో ప్రతిపక్ష, రాజకీయ పక్షాల, ప్రజాసంఘాల కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెడుతున్న సంఘటనలపై సి.ఎఫ్.డి. ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే
రాజకీయ భిన్నాభిప్రాయాలను, రాజకీయ విమర్శలను సహించలేని ఒక అసహన వాతావరణం రాష్ట్రంలో పెరిగిపోవడంపై సి.ఎఫ్.డి. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పలు పట్టణాల్లో పోలీసు యాక్ట్ సెక్షన్ 30 నిబంధనలను నిరవధికంగా పొడిగించడం, రాజకీయ పార్టీల ప్రజా సమీకరణలను అడ్డుకోవడం, ఆందోళనల నేపథ్యంలో వివిధ పార్టీల, సంఘాల నేతలను ముందస్తు గృహ నిర్బంధాలు చేయడం, అక్రమంగా నిర్బంధించడం ఒక సర్వసాధారణ వ్యవహారంగా మారడం పై సి.ఎఫ్.డి. అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసు వ్యవస్థను అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోందని, అందులో భాగంగానే వందలాది మంది ప్రతిపక్షాల కార్యకర్తలపై ఎలాంటి ఆధారాలు లేకుండా క్రిమినల్ కేసులు పెట్టడం ఒక ధోరణిగా తయారయ్యిందని కూడా సి.ఎఫ్.డి. అభిప్రాయపడింది. రాష్ట్రంలో చట్టబద్ధపాలన, నిష్పాక్షిక స్వేచ్ఛాయుత , పారదర్శక ఎన్నికలు జరగడానికి వీలుగా తమవంతు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే పోలీసు అక్రమకేసుల విషయంపై తాము దృష్టి సారించామని సి.ఎఫ్.డి. కార్యవర్గం స్పష్టం చేసింది. గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో ప్రతిపక్ష, రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల నాయకులు , కార్యకర్తలపై పోలీసులు నమోదు చేసిన కేసుల స్వరూప స్వభావాలను పరిశీలించడానికి విభిన్న జీవనరంగాలలో సుప్రసిద్ధులైన పెద్దలతో ఒక త్రిసభ్య కమిటీ ని ఏర్పాటు చేస్తూ సి.ఎఫ్.డి. సమావేశం నిర్ణయం తీసుకున్నది. కమిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిజిపి గా పనిచేసిన సీనియర్ ఐ.పి.ఎస్.అధికారి ఎం.వి. భాస్కరరావు, ఆంధ్రప్రదేశ్ పూర్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనగాని సత్యప్రసాద్, హిందూ దినపత్రిక విజయవాడ ఎడిషన్ పూర్వ రెసిడెంట్ ఎడిటర్ వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉంటారు అని తెలిపింది. ఈ కమిటీ స్వయం నిర్ణయాధికారం కలిగి నిష్పాక్షికంగా పనిచేస్తుందని, కమిటీసభ్యులు రాష్ట్రంలో పర్యటించి విభిన్న వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతారు అని, కేసులలోని వాస్తవాలను తెలుసుకుంటారని సి.ఎఫ్.డి. తెలిపింది.
త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 13 వ తేదీన విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని సి.ఎఫ్.డి. కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నది. సంబంధిత పక్షాలు, బాధితులు పాల్గొని తమ అభిప్రాయాలను త్రిసభ్య కమిటీ కి తెలియపరచవచ్చునని సి.ఎఫ్.డి. ఆ ప్రకటనలో వెల్లడించింది. ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను, ప్రచారాలను స్వేచ్ఛగా నిర్వహించుకునే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని సి.ఎఫ్.డి. విజ్ఞప్తి చేసింది. కార్యవర్గ సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శి రాష్ట్రఎన్నికల పూర్వప్రధానాధికారి డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్, సహాయకార్యదర్శి వి.లక్ష్మణరెడ్డి, కోశాధికారి ఇ .ఫల్గుణ కుమార్ , కార్యవర్గసభ్యులు పూర్వ చీఫ్ సెక్రటరీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం , పూర్వ డిజిపి ఎం.వి. కృష్ణారావు , ప్రత్యక్షంగా పాల్గొనగా మిగిలిన సభ్యులు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మీడియా సమావేశం….
59
previous post