యువత రాష్ట్ర భవిష్యత్తు కార్యక్రమం (Youth State Future Program) :
నంద్యాల జిల్లా డోన్ లో అభివృద్ధి అంటే ఫంక్షన్ హాల్ లో పార్టీ నడపినట్టు కాదని, డోన్ లో టెంట్ వేసుకున్న టెంపరరీ పార్టీ టీడీపీ అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. డోన్ పట్టణం మధు ఫంక్షన్ హాల్ లో జరిగిన యువత కోసం బుగ్గన కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ యువతీ యువకులతో ముఖాముఖిగా మాట్లాడారు. పారిశ్రామికాభివృద్ధి దిశగా డోన్ ను మార్చేందుకు మంత్రి విజన్ ఏంటని వాణి అనే యువతి ప్రశ్నించింది. డోన్ నలువైపులా రహదారులు, ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజ్ లు, స్కిల్, ఎంఎస్ఎం ఈ ట్రైనింగ్ సెంటర్ లు, రైల్వే, ఎయిర్ పోర్ట్ ఇలా అన్ని వసతులుండేలా చేశాం, ఇక మిగిలింది పారిశ్రామికాభివృద్ధేనని మంత్రి బదులిచ్చారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గురించి ప్రశ్నించిన సులోచనకు మంత్రి బుగ్గన సమాధానం చెప్పారు.
తాగునీరు, 36 చెరువులు నింపి సాగునీరు, షెఫర్డ్ ట్రైనింగ్ సెంటర్, వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలను నిర్మించాం. రూ. 50 కోట్లతో ప్యాపిలిలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ నిర్మిస్తున్నాం.. త్వరలోనే ఆ చుట్టు పక్కల రైతులకు మేలు జరిగేలా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. ప్రభుత్వ బడులను చక్కగా తీర్చిదిద్దితేనే ప్రైవేట్ స్కూళ్లను తగ్గించగలమని, అందుకే నాడు -నేడు కార్యక్రమం ద్వారా వేలాది పాఠశాలలను తీర్చిదిద్దామని ఆయన అన్నారు. అమ్మ ఒడి ప్రైవేట్ పాఠశాలల పిల్లలకెందుకని ఓ సాఫ్ట్ వేర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ప్రైవేట్ స్కూల్ అయినా, ప్రభుత్వ బడి అయినా ప్రతి చిన్నారిని ప్రతి అమ్మ చదివించుకోవాలని సీఎం ఆలోచించి అందరికీ అందిస్తున్నామని మంత్రి అన్నారు. మహిళలు, ఆడపిల్లలు స్వేచ్ఛగా బతకడానికే దిశ యాప్ తీసుకువచ్చామని, లా అండ్ ఆర్డర్ ను మెయిన్ టైన్ చేయడానికి పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ఆయన అన్నారు. భవిష్యత్ లో రాత్రులు కూడా అమ్మాయిలు స్వేచ్ఛగా ఉద్యోగాలకు ధైర్యంగా వెళ్లొచ్చేలా చర్యలు చేపడతామని, యువతదే రాష్ట్ర భవిత అని మంత్రి బుగ్గన అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నియోజకవర్గం, రాష్ట్రం, దేశం ముందుకెళ్లేది యువత భాగస్వామ్యం వల్లేనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన నుంచే యువకులకు పెద్దపీట వేశామని అందుకే మన పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వయసెంత? ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వయసెంత, మనుషులతో సంబంధాలు తెగి పోయి చిత్ర విచిత్రంగా బాబు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మనిషి జీవితంలో బాల్యం, యవ్వనం, కౌమారం, వానప్రస్థము అనేవి నాలుగు దశలు ఉన్నాయి. మూడు దశలు దాటి నాలుగో దశకు చేరితే అడవి పోవాలని అర్థమని ఆయన అన్నారు. చంద్రబాబుతో సమాన వయసు మన డోన్ అభ్యర్థిది. జగదేకవీరుని కథ సినిమాలో రేలంగి చెప్పినట్లు వృద్ధులే పోటీకి దిగితే యువతకు అవకాశమేది అని ఆయన అన్నారు. అడవికి పోయి ధ్యానం చేసి, పుస్తకాలు చదివిన అనుభవంతో మంచి చెడులు చెప్పాల్సిన వయసులో మీ మాటలేంటి అని, రాజకీయాల్లో నేను బచ్చా అని డోన్ టీడీపీ అభ్యర్థి మాట్లాడారు. 30 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇంజనీరింగ్ చదువులో ఉన్నప్పుడే సర్పంచ్ గా పని చేశానని, అభివృద్ధి చేయని మీ రాజకీయ అనుభవం దేనికి, మీ రాజకీయ అనుభవమెంత చేసిన అభివృద్ధి ఎంత? చర్చకు సిద్ధమా అని ఆయన అన్నారు.
ఎంత తక్కువ సమయంలో ఎవరెంత అభివృద్ధి చేశారో ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నయా బుల్లెట్ దిగిందా లేదా అని పోకిరి సినిమా డైలాగ్ కొట్టి యువతను మంత్రి బుగ్గన ఉత్సాహపరిచారు. కేంద్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రుల హోదాలు అనుభవించి మీ సొంత ఊళ్లకు రోడ్లు వేయలేని మీరా మాట్లాడేదని బుగ్గన ప్రశ్నించారు. డోన్ అడ్డా అని మాట్లాడే ప్రతిపక్షాలకు డోన్ లో సొంత ఇల్లు ఎందుకు లేదు సొంత పార్టీ కార్యాలయం లేదని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మా ఇంటి పక్కన సాయి ఫంక్షన్ హాల్ యే కదా మీ అడ్డా, మీ ఫంక్షన్ హాల్ లో సినిమా పాటలొచ్చాక కానీ అర్థం కాలేదు అది కూడా మీ అడ్డా కాదని కాలేదని వారిపై పంచులు వేశారు. ఏ రోజు మీ ఫంక్షన్ హాల్ లో మీ పార్టీ ఉంటుందో.. ఏ రోజుండదో ఎవరికి తెలియడం లేదని అన్నారు. రోడ్లు, ఆసుపత్రి, గుడి, బడి, కాలేజ్ అభివృద్ధి కాదా, కాంట్రాక్టర్ కు లాభం రాకూడదనే డోన్ లో మీ హయాంలో ఏమీ కట్ట లేదా అని ఆయన అన్నారు.
బేతంచెర్ల నుంచి డోన్ కు జాతీయ రహదారి, పెద్ద మల్కాపురం, చిన మల్కాపురం, వలిసెల, కొచ్చెరువు, నల్లపకుంట్ల, ఎర్రగుంట్ల, కమలాపురం, కన్నపగుంట్ల, కొత్తకోట, కోట్రాయి, తిరుమానుపల్లె, ఇందిరంపల్లె, రేకులకుంటకు వేసిన రోడ్డు అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు. వాటర్ గ్రిడ్ ద్వారా రూ. 351 కోట్లు ఖర్చు పెట్టి చిట్ట చివరి పల్లెలైన ఇందిరం పల్లె, కొత్త బురుజు, చనుగొండ్ల, వంగమిట్టపల్లె, కౌలుపల్లెలకు 120 కి. మీ పైప్ లైన్ల ద్వారా 76 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి ఇంటింటికి నీరిస్తే అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు. 36 చెరువులకు నీరు నింపి 30 గ్రామాలకు సాగు నీరందించడం అభివృద్ధి కాదా, రూ. 50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ కట్టడం అభివృద్ధి కాదా, యువతకు ఉపాధి అవకాశాలందించడానికి రూ. 20 కోట్లతో ఐడీటీఆర్ ప్రాజెక్టు నిర్మించడం అభివృద్ధి కాదా, ఓర్వకల్లు దగ్గర మెగా ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణం అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు.
మీ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో 10 మందికైనా ఉపాధి అవకాశాలు కల్పించారా అని ఛాలెంజ్ చేసారు. ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో బోయింగ్ కంపెనీ ద్వారా పాలిటెక్నిక్, ఐటీఐ, ఫ్లై స్కూల్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. మీ అనుభవంలో బడి సంగతి దేవుడెరుగు కనీసం మరుగుదొడ్లు కట్టారా అని ఎద్దేవా చేశారు. యువత భవిష్యత్ ను నాశనం చేసేలా స్కిల్ డెవలప్ మెంట్ లో టీడీపీ స్కాం చేసిందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ ఇలా అన్నీ డోన్ లో ఉండేలా భవిష్యత్ లో ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తాం అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన యువతకు చెప్పారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి