ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్దంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య జరిగిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం నిన్న అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 240 మంది బందీల్లో 24 మందిని హమాస్ విడిచిపెట్టింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 39 మంది పాలస్తీనా ఖైదీలకు స్వేచ్ఛ కల్పించింది. హమాస్ విడుదల చేసిన బందీలు దేశానికి వచ్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. వారికి ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మొత్తం 50 మంది బందీలను విడుదల చేయనుండగా, ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది. ఒప్పందంలో లేకున్నా 10 మంది థాయ్ జాతీయులు, ఒక ఫిలిప్పీన్స్ దేశస్థుడిని హమాస్ విడిచిపెట్టింది. దీంతో మొత్తం 24 మందికి హమాస్ స్వేచ్ఛ ప్రసాదించినట్టు అయింది. కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ఖతర్ బందీల విడుదలను నిర్ధారించింది. రెడ్‌క్రాస్ సంస్థ ద్వారా బందీల విడుదల సజావుగా సాగింది. హమాస్ చెర నుంచి బందీలు తిరిగి రావడంతో ఇజ్రాయెల్ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు, కాల్పుల విరమణ నేపథ్యంలో గాజాకు మానవతా సాయం అందింది. నాలుగు ఇంధన ట్యాంకర్లు, వంటగ్యాస్‌తో మరో నాలుగు ట్యాంకర్లు గాజాలోకి ప్రవేశించాయి. రోజుకు 150 ట్రక్కుల అత్యవసర సామగ్రి కూడా ఈ నాలుగు రోజుల్లో గాజాకు అందనుంది.
బందీల్లో 24మందిని విడిచిపెట్టిన హమాస్
76
previous post