గత కొన్ని రోజులుగా కేరళ , తమిళనాడు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. తమిళనాడులోని చెన్నై, తూత్తుకుడి, నీలగిరి, తిరుచ్చిరపల్లి, తిరునెల్వేలి, కన్యాకుమారి, తెన్కాసి, పుదుకోట్టై, విరుదునగర్, తేని సహా పలు జిల్లాల్లో బుధవారం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం పడుతోంది. దీంతో ఆయా జిల్లాల యంత్రాంగం విద్యా సంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించింది. ఇక చెన్నైలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ నీటమునిగాయి. దీంతో ఓ సబ్వేలో బస్సు చిక్కుకుపోయింది. పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. కేరళలోనూ భారీ వర్షం కురుస్తోంది. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో బుధవారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రానున్న రోజుల్లో పతనంతిట్టతోపాటు మరో రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీ వర్షం కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల వెళ్లే రహదారిపై కొండచరిలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కేరళ , తమిళనాడులో భారీ వర్షాలు
101
previous post