తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. వల్లివేడు పంచాయతీ పరిధిలో మామిడి తోటలపై విరుచుకు పడుతూ పంట నష్టానికి పాల్పడుతున్నాయి. అంతే కాకుండా ఏనుగుల గుంపు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సమాచారం తెలుసుకున్న తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంగళవారం ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన మామిడి చెట్లను పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడారు. పంట నష్ట తీవ్రతను అంచనా వేయాలని సూచించారు. అనంతరం వల్లివేడు గ్రామ సచివాలయం వద్ద ప్రజలు, బాధిత రైతులతో మాట్లాడారు. 10 ఏనుగుల గుంపు రాత్రి వేళల్లో వచ్చి పంటను నష్టపరచడం ఇది మూడవ సారి అని తెలిపారు. కర్ణాటక సరిహద్దుల నుంచి ఏనుగుల గుంపు వస్తోందని, ఏ క్షణాన్నైనా గ్రామం వైపు వస్తాయేమోనన్న భయం నెలకొందని వారు తెలిపారు. అటవీ సరిహద్దు ప్రాంతాలైపైన అటవీ శాఖ అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు కోరారు. వెంటనే చిత్తూరు, తిరుపతి జిల్లాల డీఎఫ్ఓ అధికారులతో మోహిత్ రెడ్డి మాట్లాడారు. అత్యవసరంగా చర్యలు చేపట్టాలని కోరారు. అధైర్య పడకండి.. ఐకమత్యంగా మెలిగి ఫారెస్ట్ అధికారుల సహకారంతో ఏనుగుల గుంపును తరిమేద్దామని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయంత్రం వేళల్లో పంట పొలాలకు వెళ్ళరాదని సూచించారు. ఏనుగులు కంట పడితే వెంటనే సంబంధిత పారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఏనుగుల గుంపును త్వరితగతిన తరలింపునకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వ అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఏనుగుల గుంపు హల్చల్ – భయాందోళనలో ప్రజలు
65
previous post