పశ్చిమబెంగాల్లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందిస్తూ.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దీంతో స్పష్టమైందన్నారు. ఇక, దీదీ దిగిపోయే సమయం ఆసన్నమైందన్నారు. తొలి దశలో భాగంగా 152 సీట్లకు పోలింగ్ జరగ్గా.. అందులో 110కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు తమ భవిష్యత్తును తొలి దశలోనే నిర్ణయించుకున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని అభివృద్ధికి వారు మొగ్గు చూపారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. పశ్చిమ బెంగాల్లో భయానక పాలనను అంతం చేస్తామని అమిత్‌షా పేర్కొన్నారు. చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మార్పు అంటే.. చొరబాటు రహిత బెంగాల్‌గా మార్చడమేనన్నారు. అవినీతి, బుజ్జగింపులు, దోపిడీల నుంచి స్వేచ్ఛ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.
National
ఆమ్ ఆద్మీ పార్టీ కి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, కీలక నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా సహా మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. ఢిల్లీలో సీనియర్ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లతో కలిసి రాఘవ్ చద్దా ఈమేరకు ప్రకటన చేశారు. 15 ఏళ్లుగా ఆప్‌కు అంకితభావంతో పనిచేశానన్నారు రాఘవ్ చద్దా. ఒకప్పుడు అవినీతి నిర్మూలన నినాదంతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఇప్పుడు నిజాయతీ రాజకీయాలకు దూరమైందన్నారు. తాను సరైన వ్యక్తినే, కానీ తప్పుడు పార్టీలో ఉన్నాననీ… అందుకే పార్టీకి దూరమై ప్రజలకు దగ్గరవుతున్నాను రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు.తనతో పాటు మూడింట రెండొంతుల మంది ఆప్ పార్లమెంటరీ పార్టీ కూడా బీజేపీలో విలీనం అయ్యిందన్నారు.
గత కొంతకాలంగా పార్టీలో రాఘవ్ చద్దా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఆయన్ను రాజ్యసభలో ఆప్ ఉప నాయకుడి పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించారు. ఈ పరిణామం పార్టీ అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలోనే చద్దా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ నాయకత్వానికి ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది.
కడప జిల్లాలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే… అక్రమాలకు రహదారిగా మారింది. పులివెందుల మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు కాసుల వేటలో బిజిగా ఉంటే.. ఇంకో వైపు అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు సిద్ధమైపోతున్నారు. బెంగళూరు– విజయవాడ మధ్య నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే లో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు సీవీఆర్ న్యూస్ పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా రోడ్డు నిర్మాణం కోసం ఎర్రిపల్లి వంక నుంచి నాణ్యతలేని మట్టిని కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. అలాగే పులివెందుల సమీపంలోని వాగులు, వంకలు, చెరువులు నుంచి పెద్ద ఎత్తున మట్టిని రహదారి కోసం వాడతున్నట్లు స్పష్టమవుతోంది. నిత్యం వందలాది టిప్పర్లు ఈ మార్గంలో తిరుగుతున్నా.. కళ్ల ముందే అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులకు ఏ మాత్రం పట్టడం లేదు… SPOT
ఎర్రిపల్లి వంక దగ్గరున్న మట్టి నాణ్యత ఎక్కువగా లేదని.. అది చాలా వదులుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనితో రహదారిని నిర్మిస్తే.. కొద్ది రోజుల్లోనే కుంగిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ విషయం ఇక్కడి అధికారులకు కూడా బాగా తెలుసని అయినా ఉద్దేశపూర్వకంగానే వారు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పులివెందుల మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాడులు చేసి కట్టడి చేయాల్సిన అధికారులే మౌనం వహిస్తుండడంతో… అక్రమార్కుల ఆటలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీనిపై తహసీల్దార్ వివరణ కోరితే.. నాణ్యత ప్రమాణాలు తమ పరిధిలోకి రావని.. నేషనల్ హైవే అథారిటీ అధికారులు చూసుకుంటారని చెబుతున్నారు..
ఇక RDO కూడా ఇదే తరహా స్పందన కనబరుస్తున్నారు. నాణ్యత గురించి సైట్ ఇంజినీర్లు పరిశీలించాలని.. వెంటనే వారికి తగిన సూచనలిస్తామని అంటున్నారు. పనులు త్వరగా ముగించాలన్న హడావుడిలో నాణ్యత పట్టించుకోకపోవడం సరికాదని RDO అంటున్నారు…
ఇక అటు చిన్న చిన్న కుంటల్లోని మట్టిని తరలిస్తున్నా మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులకు పట్టడం లేదు. ఇతర పనుల్లో బిజీగా ఉన్నామంటూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ఇప్పటికే విజయవాడ- బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేలో చేపట్టిన అండర్ బ్రిడ్జిలను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వంతెనలు తక్కువ ఎత్తులో ఉన్నాయని… గ్రామ ప్రజలు అంటున్నారు. జాతీయ హైవే నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని… పులివెందుల ప్రజలు మండిపడుతున్నారు.
ఎండలు మండుతున్నా.. రాజకీయాలు వేడెక్కుతున్నా.. బెంగాల్ ఓటరు మాత్రం ఎక్కడా తగ్గలేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల రణక్షేత్రంలో ఓటర్లు పోటెత్తారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం, సాయంత్రం వరకు అదే ఉత్సాహాన్ని కొనసాగించారు. ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం, సాయంత్రం 5 గంటల సమయానికే రాష్ట్రవ్యాప్తంగా సగటున 89% ఓటింగ్ నమోదైంది. ఇక పోలింగ్ ముగిసే సమయానికి 92 శాతం దాటొచ్చనే టాక్ వినిపిస్తోంది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ నియోజకవర్గాల్లో ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటలకే 90 శాతానికి పైగా ఓటింగ్ జరిగినట్లు సమాచారం. అయితే ఈసారి కూడా మహిళా ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా కనిపిస్తున్నారు. పొడవైన క్యూ లైన్లలో మహిళలు పెద్ద ఎత్తున వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా కొన్ని హింసాత్మక ఘటనలు మినహా, పోలింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగా సాగింది. కేంద్ర బలగాల పహారాలో ఓటర్లు నిర్భయంగా ఓటు వేశారు.
సాధారణంగా బెంగాల్లో పోలింగ్ శాతం ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది, కానీ 5 గంటలకే 89 శాతం మార్కును తాకడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ భారీ ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉండగా మొదటి విడతలో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సుమారు 3.6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్లో జరుగుతోంది.
ఇక తమిళనాడులోనూ పోలింగ్ రికార్డ్ స్థాయిలో నమోదైంది. తమిళనాడు అంటేనే సినిమాకు ఓ రేంజ్ క్రేజ్.. రాజకీయం అంటే ఒక ఎమోషన్.. ఆ ఎమోషన్‌ను తమిళ తంబీలు ఇవాళ తమ ఓటుతో వ్యక్తపరిచారు. సాయంత్రం 5 గంటలకే 82 శాతం పైగా పోలింగ్ అంటే.. ఇది ఓటర్ల తీర్పు కాదు, రాజకీయ పార్టీలకు ఒక భారీ వార్నింగ్ బెల్ అని చెప్తున్నారు. వాస్తవానికి ఎండాకాలం కావడంతో.. మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఓటర్లు ఉదయం సమయమే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్ బూతుల దగ్గర ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరటం కనిపించింది. పోలింగ్ పూర్తిగా ముగిసే సమయానికి 90 శాతం దాటొచ్చనే అంచనాలున్నాయి. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 76.6 శాతం ఓట్లు నమోదయ్యాయి.
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ డీఎంకే-ఎన్డీఏ కూటమి, టీవీకే పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. 234 నియోజకవర్గాల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. సినీ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాట ట్రయాంగిల్ వార్ జరుగుతోంది.
ప్రధాని మోదీ ఉగ్రవాది అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు కేంద్ర మంత్రులు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే ఎన్నికల సంఘం నుంచి ఈ స్పందన వచ్చింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్లో గురువారం పోలింగ్ జరగనున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడికి నోటీసులు వచ్చాయి. చెన్నైలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. అన్నాడీఎంకేపై విరుచుకుపడ్డారు. అన్నాదురై ఫొటో పెట్టుకునే అన్నాడీఎంకే నేతలు మోదీతో ఎలా చేతులు కలపగలరు? అని ప్రశ్నించారు. సమానత్వంపై ఆయనకు నమ్మకం లేదంటూ మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేయగా తన వ్యాఖ్యల్లోని ఉద్దేశంపై ఖర్గే వివరణ ఇచ్చారు. మోదీని ఎప్పుడూ ఉగ్రవాది అనలేదని, దేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని ఆయన టెర్రరైజ్ చేస్తున్నారని చెప్పడమే తన ఉద్దేశమని వివరించారు.
దేశ వ్యాప్తంగా ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన తమిళనాడులోని 234 స్థానాలతో పాటు పశ్చిమ బంగాల్ లోని 152 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే తమిళనాడుతో పాటు పశ్చిమ బంగాల్ ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఇక నాయకులు కూడా హోరా హోరీగా ప్రచారం చేశారు.ఎన్నికల నియమావళి ప్రకారం మొన్నటి సాయంత్రంతో మైకులు మూగబోయాయి. ఓటర్లు నేడు తమకు కాబోయే నాయకుడు ఎవరనేది తమ ఓటుతో డిసైడ్ చేయనున్నారు.
తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, డీఎంకే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి, విజయ్ కు సంబంధించిన టీవీకే పోటాపోటీగా ప్రచారం చేశారు. తమిళనాడులోని అన్ని స్థానాలకు ఒక్క విడతతోనే పోలింగ్ జరగనుంది. డీఎంకే ఈ ఎన్నికల్లో 164 చోట్ల బరిలో దిగింది. మిగిలిన స్థానాలను తమ మిత్రపక్షాలకు కేటాయించింది. ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే 169 స్థానాల్లో తన అభ్యర్ధులను నిలబెట్టింది. విజయ్ కు చెందిన తమిళ వెట్రి కళగం 234 స్థానాల్లో బరిలో దిగింది. మొత్తంగా 234 స్థానాలకు 4023 మంది బరిలో ఉన్నారు. మొత్తంగా 5,73,43, 291 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇక దేశంలోని తూర్పున ఉన్న పశ్చిమబెంగాల్ లో రెండు విడతల్లో ఎన్నికల్లో జరగనున్నాయి. మమత నేతృత్వంలోని టీఎంసీ, భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ సహా పలువువు కీలక బీజేపీ నేతలు ఎన్నికల్లో తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ సుడిగాలి పర్యటనలు చేశారు. ఇక ఎన్నికల సర్వేలో టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది. ఇక పశ్చిమ బంగాల్ తొలి విడత ఎన్నికల్లో దాదాపు 3 కోట్ల 60 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
శ్రావణ్ బాబు, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్
విజయ్ ను ఒక విషయంలో మెచ్చుకోవాలి. రజనీకాంత్ చేయలేకపోయిన రాజకీయరంగ ప్రవేశమనే సాహసాన్ని చేసినందుకు. రాజకీయాలలో ప్రవేశించటమే కాదు, బీజేపీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే వంటి ఎన్నిపార్టీలు పొత్తు పెట్టుకుందామన్నా, నిరాకరించి ముఖ్యమంత్రి కావటమే లక్ష్యంగా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దూకారు. మరి అతను ఈ ఎన్నికల తర్వాత కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా, అసలు అతని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది పరిశీలిద్దాం.
తమిళనాడులో ఇప్పటివరకు సినీరంగంనుంచి అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత రాజకీయాలలో ప్రవేశించి ముఖ్యమంత్రులయ్యారు. వారి బాటలోనే సీఎమ్ అవ్వటం లక్ష్యంగా విజయ్ వచ్చారు. అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. వారందరూ రాజకీయాలలోకి ఓవర్ నైట్ వచ్చి ముఖ్యమంత్రులైపోలేదు. ఎంతోకాలం రాజకీయాలలో ఢక్కాముక్కీలు తిని, విశేష అనుభవం గడించిన తర్వాత ప్రజల మెప్పు పొంది ముఖ్యమంత్రులయ్యారు.
విజయ్ ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో. సినీ కుటుంబంనుంచే వచ్చారు. అతని తండ్రి చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు. ఆయనే అతనిని హీరోగా లాంచ్ చేశారు, మెంటార్ చేశారు, ప్రణాళికాబద్ధంగా అతని కెరీర్ ను నిర్మించారు. డాన్సులు, కామెడీ, ఫైట్స్ విజయ్ బలాలు. అతని ఖాతాలో అనేక బంపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో అనేక సినిమాలు తెలుగు రీమేకులు కావటం విశేషం. మహేష్ ఒక్కడు, పోకిరి సినిమాల రీమేకులు అతనికి మంచి లైఫ్ ఇచ్చాయి. పవన్ కళ్యాణ్ తమ్ముడు, బద్రి సినిమాల రీమేకులలో కూడా నటించి విజయ్ హిట్లు కొట్టారు. తన నటనలో అక్కడక్కడా పవన్, మహేష్ ఛాయలు కనబడుతుంటాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు విజయ్ దాదాపు రు.150 కోట్లు తీసుకుంటారు.
2024 ఫిబ్రవరి 2 న తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని ప్రారంభించారు. తమకు రాజకీయ శత్రువు డీఎంకే అని, సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని ప్రకటించారు. అవినీతి నిర్మూలన, సామాజిక న్యాయం, తమిళ ఆత్మగౌరవం లక్ష్యాలని వక్కాణించారు. పార్టీ ప్రారంభించి రెండేళ్ళు పైనే అయినప్పటికీ 7-8 నెలలనుంచే చురుకుగా కార్యకలాపాలు నడుపుతున్నారు. అది కూడా, మొదట్లో కేవలం శని, ఆదివారాలలో మాత్రమే సభలలో పాల్గొనేవారు.
విజయ్ అనుకూల అంశాలు
1. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే… రెండు పార్టీల పాలకులనే చూసి విసిగిపోయిన ప్రజలకు ఇప్పుడు విజయ్ ద్వారా ఒక మూడో ఛాయిస్ ఏర్పడింది. ఆ రకంగా విజయ్ పార్టీ టీవీకేకు ఒక అడ్వాంటేజ్ ఏర్పడింది. దానికితోడు కొత్త పార్టీ కావటంతో అవినీతి మరక ఉండదు.
2. పాపులర్ హీరో కావటంతో విజయ్ పై యువతలో బాగా ఆకర్షణ ఉంది. అతనంటే ప్రాణాలిచ్చే యువతీ యువకులు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా జెన్ జీ విజయ్ సభలకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. అయితే వారందరూ విజయ్ పార్టీకి ఓట్లు వేస్తారా అనేదే ఇక్కడ వేచి చూడాల్సిన విషయం.
3. విజయ్ క్రైస్తవ మతానికి చెందినవారు కావటంతో ఆ వర్గం ఓట్లను బాగా ఆకర్షించే అవకాశం ఉంది.
4. విజయ్ కు నిధుల కొరత లేదు. లాటరీ కింగ్ గా తమిళనాడులో చెప్పుకునే అథర్వ అర్జున్ అనే అతను టీవీకేకు నిధులు సమకూరుస్తున్నాడని అంటున్నారు.
5. విజయ్ ఎంతోకాలంనుంచి దానాలు, విరాళాలు పెద్ద సంఖ్యలో చేశారు, విద్యార్థినీ, విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
విజయ్ ప్రతికూల అంశాలు
1. పార్టీకి సరైన ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదు.
2. కరూర్ తొక్కిసలాట ఘటనలో 40 మంది చనిపోయిన ఘటన ఒక పెద్ద మరకగా మిగిలిపోయింది. ముఖ్యంగా ఆ ఘటనపై విజయ్ స్పందించిన తీరు ఆక్షేపణీయంగా ఉంది. ఘటన జరిగిన వెంటనే విజయ్ మీడియాకు దొరకకుండా పారిపోవటం, రెండు రోజుల తర్వాత మీడియాకు వీడియో బైట్ పంపించటం. ముఖ్యంగా, ఆ బైట్ లో కూడా ఎక్కడా అతని ముఖంలో జరిగినదానికిగానూ బాధపడుతున్న ఛాయలు కొద్దిగా కూడా కనబడకపోవటం. అతను అలా కాకుండా, కనీసం మరుసటి రోజైనా పోలీస్ ప్రొటెక్షన్ తో వచ్చి బాధితులను పరామర్శించి, వారికి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుని ఉంటే మంచి పేరు వచ్చిఉండేది.
3. పార్టీ ప్రచార కార్యక్రమాలు, సభలలో విజయ్ చురుకుగా పాల్గొనకపోవటం. బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లూ జరిగిన తర్వాత చివరి క్షణంలో అతను దానిని క్యాన్సిల్ చేసుకుని వీడియో సందేశం పంపుతున్నారు. దీనిపై సభకు వచ్చినవారిలో, అతని అభిమానులలో కూడా అసంతృప్తి ఏర్పడుతోంది.
4. విజయ్ వైవాహిక జీవితం రోడ్డెక్కటం మరో మైనస్ పాయింట్. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అతని భార్య సంగీత విడాకులకోసం కోర్టు మెట్లు ఎక్కారు. అతనికి ఒక ప్రముఖ నటితో సంబంధం ఉందని ఆమె విడాకుల పిటిషన్లో ఆరోపించారు. ఇది జరిగిన కొద్ది కాలానికే విజయ్ ఒక శుభకార్యంలో హీరోయిన్ త్రిషతో కలిసి హాజరవటం సంచలనంగా మారింది. మరోవైపు విజయ్ కొడుకు కూడా అతనిని ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో అయ్యి, తన పేరులోని విజయ్ ను తొలగించుకున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారం మొత్తం వలన ఓటర్ల మనసులో, ముఖ్యంగా మహిళా ఓటర్లలో అతని ఇమేజికి చెడే కానీ మంచి అయితే జరగదు.
5. విజయ్ కు క్లీన్ ఇమేజ్ అయితే లేదు. తాను కొన్న అతి ఖరీదైన రోల్స్ రాయిస్ కారుకు పన్ను తప్పించుకోవటంకోసం తప్పుడు లెక్కలతో అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపణ ఉంది. దానిపై కోర్టులో కేసు ఇంకా నడుస్తోంది.
6. పార్టీ పెట్టి రెండేళ్ళు దాటినా, ఇప్పటికీ విజయ్ ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టిన పాపాన పోలేదు. మహా అయితే ఏదైనా విషయంపై స్పందించాలంటే వీడియో బైట్లు వదులుతున్నారు. ఇది ఆయనలోని ఆత్మవిశ్వాస లేమిని, నాయకత్వ లక్షణాల లేమిని చూపుతోంది. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టి రెండేళ్ళు దాటినా ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడకపోవటం అనేది ఇప్పటివరకు దేశంలో ఎక్కడా జరగని విషయం.
ట్రయాంగిల్ ఫైట్
కొన్ని దశాబ్దాలుగా రెండే ప్రధాన పక్షాల మధ్య ముఖాముఖి పోటీగా నడుస్తున్న ఎన్నికల పోరు, విజయ్ ప్రవేశంతో ఈ సారి ముక్కోణపు పోటీగా మారింది. అధికార డీఎంకే కూటమిలో కాంగ్రెస్, విజయకాంత్ పార్టీ, వీసీకే అనే దళితపార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ వంటి మొత్తం 14 పార్టీలు ఉన్నాయి. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, వన్నియార్ల పీఎంకే పార్టీ, టీఎంసీ వంటి 12 పార్టీలు ఉన్నాయి. విజయ్ పార్టీ టీవీకే మొత్తం 234 స్థానాలలో ఒంటరిగా పోటీ చేస్తోంది. పేరుకు ఇంకో పార్టీ ఎన్టీకే కూడా మొత్తం 234 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నా, దాని ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుంది. కారణం – ఆ పార్టీ అధినేత సీమన్ ఎత్తుకున్న తమిళ జాతీయవాదం. 800 – 1000 సంవత్సరాలకు ముందునుంచి తమిళనాడులో ఉన్నవారే రాష్ట్రాన్ని ఏలాలి అనేది ఆయన వాదం. ముఖ్యంగా, 500 ఏళ్ళనుంచి తమిళనాడులో ఉంటున్న తెలుగువారు టార్గెట్ గా ఆయన ఈ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తుంటారు. అయితే ఆ వాదానికి పెద్దగా సపోర్ట్ లేకపోవటంతో ఆయనకు 6 – 8 ఓట్ల శాతం మాత్రమే దక్కుతూ ఉంటుంది.
డీఎంకే ప్లస్, మైనస్ లు
డీఎంకే ప్రభుత్వ పాలనపై ప్రధానంగా వినబడే విమర్శ – శాంతి భద్రతల సమస్య. ఆడవారిపై, బాలికలపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు గంజాయి వంటి మత్తుమందుల వాడకం తీవ్రంగా పెరిగింది. అవినీతి పెరిగిందనే ఆరోపణలు కూడా బాగానే వినబడుతున్నాయి. కావేరి డెల్టాలోని రైతులు కూడా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. అయితే ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కూడా లేదు.
డీఎంకే బలం ఆ పార్టీకి ఉన్న పటిష్ఠమైన వ్యవస్థాపక నిర్మాణం. అది కార్పొరేట్ స్థాయిలో సమన్వయంతో సాగుతూ ఉంటుంది. గత ఐదేళ్ళనుంచి సరిగ్గా పనితీరు కనబరచలేకపోయిన 60 మంది ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు నిరాకరించి, వారి స్థానాలలో కొత్తవారికి అవకాశం కల్పించారు. డీఎంకే మరోబలం క్రైస్తవ, ముస్లిమ్ ఓట్ బ్యాంకు. తమిళనాడులో మైనారిటీల ఓట్లు మొదటినుంచీ డీఎంకేకు పడుతూ ఉంటాయి. ఇక, అధినేత స్టాలిన్ తమిళనాడు హక్కులకోసం, డీలిమిటేషన్ కు వ్యతిరేకంగ కేంద్ర ప్రభుత్వాన్ని ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఎదుర్కోవటం కూడా ఒక పాజిటివ్ పాయింట్.
అన్నాడీఎంకే ప్లస్, మైనస్ లు
అన్నాడీఎంకేకు బలమైన సంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉంది. ముఖ్యంగా మహిళల ఓట్లు ఎక్కువగా ఆ పార్టీకి పడుతుంటాయి. బీజేపీ భాగస్వామి కావటం మరో పెద్ద ప్లస్ పాయింట్. దీనివలన ఆర్థిక వనరుల సమస్య తలెత్తే సమస్యే ఉండదు. పళనిస్వామి, అన్బుమణి రాందాస్ వలన గౌండర్, వన్నియార్ ఓట్లు బాగానే చీల్చుకోగలుగుతారు.
అన్నాడీఎంకే మైనస్ లు చూస్తే, జయలలిత తర్వాత కరిష్మా ఉన్న పెద్ద నేత ఎవరూ లేకపోవటం ప్రధానమైన నెగెటివ్ పాయింట్. విజయ్ పెట్టిన కొత్తపార్టీ వలన అన్నాడీఎంకేకు పడవలసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటులో గండి పడటం రెండో నెగెటివ్ పాయింట్. విజయకాంత్ పార్టీ ఎండీఎంకే ఈ కూటమినుంచి వైదొలిగి డీఎంకే కూటమిలో చేరటం మరో పెద్ద దెబ్బ. పళనిస్వామి వ్యవహారశైలికి నిరసనగా పనీర్ సెల్వం, సెంగొట్టయ్యన్ వంటి పలువురు సీనియర్ అన్నాడీఎంకే నేతలు బయటకు వెళ్ళిపోయారు. దేవర్, వన్నియార్ కులాలు అన్నాడీఎంకేకు దూరమయ్యాయి. ఏది ఏమైనా అన్నాడీఎంకే గ్రాఫ్ నానాటికీ తగ్గుతోందన్నది నిజం.
కుల ప్రభావం
తమిళనాడు ద్రవిడ పార్టీలన్నీ సిద్ధాంతపరంగా కులరహిత సమాజం కావాలని ఘోషిస్తున్నప్పటికీ, అక్కడ కులాలే ముఖ్యపాత్ర పోషిస్తూ రావటం ఒక విచిత్రమైన పరిణామం. అయితే ఈ ఎన్నికలలో మాత్రం కులాలు అతి తక్కువ ప్రభావం చూపుతాయని అంటున్నారు. దానికి కారణాలను చూద్దాం.
తమిళనాడులో ముఖ్యంగా ఉత్తరాన వన్నియార్ కులం, దక్షిణాన దేవర్ కులం, పశ్చిమాన గౌండర్ కులం ప్రధానంగా ఇప్పటిదాకా రాజకీయాలను శాసిస్తూ వచ్చాయి. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు మారింది. ఏ కులం ఓట్లూ గంపగుత్తగా ఒకపార్టీకి పడేటట్లుగా ఇప్పుడు లేదు.
ఉదాహరణకు తీసుకుంటే – వన్నియార్ల ఓట్లన్నీ పీఎంకే పార్టీకి పడేవి. వన్నియార్ల పార్టీ పట్టాళి మక్కళ్ కచ్చి అధినేత రాందాసుకు, ఆయన సుపుత్రుడు అన్బుమణికి మధ్య విభేదాలు రావటంతో ఈయన ఒక కూటమిలోకి, ఆయన మరో కూటమిలోకి వెళ్ళారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనే పీఎంకే ప్రభావం దారుణంగా పడిపోయింది.
ఇక దేవర్ కులం సంగతి చూస్తే, ఇంతకుముందు దేవర్ల ఓట్లు గంపగుత్తగా అన్నాడీఎంకేకు పడేవి. దానికి కారణం ఆ కులానికి చెందిన ఓ పన్నీర్ సెల్వం, దినకరన్, శశికళ తదితరులు ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ఉండటం. గౌండర్ కులస్థుడైన పళనిస్వామి అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో దేవర్ల ప్రాబల్యం తగ్గింది. దానికితోడు మాజీ ముఖ్యమంత్రి పనీర్ సెల్వం డీఎంకే పంచన చేరటంతో దేవర్ కులం ఓట్లు రెండు కూటముల మధ్య పంచుకోబడుతున్ననాయి.
పశ్చిమప్రాంతమైన కొంగునాడులో మొదటినుంచి గౌండర్ కులం ప్రాబల్యం బాగా ఉంటుంది. ఇది అన్నాడీఎంకే కంచుకోట. అయితే ఇటీవల గౌండర్ల ఓట్లు కొల్లగొట్టటంకోసం స్టాలిన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. సెంథిల్ బాలాజీ అనే మంత్రికి ప్రత్యేకంగా ఆ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు గౌండర్ ఓట్లలో చీలిక కనపడుతోంది.
వర్తక వాణిజ్యాలలో ఎక్కువగా ఉండే నాడార్లు మరో పెద్ద కులం. కామరాజ్ నాడార్ కారణంగా వారు మొదటినుంచి కాంగ్రెస్ పార్టీతో ఉండేవారు. తర్వాత అన్నాడీఎంకేకు దగ్గరయ్యారు. కానీ, జయలలిత చనిపోయిన తర్వాత పార్టీలో గౌండర్, వన్నియార్ల ప్రాబల్యం పెరగటంతో అన్నాడీఎంకేకు దూరమయ్యారు. వారిని దువ్వటానికి డీఎంకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. డీఎంకే ఎంపీ కనిమొళి ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు. తెలంగాణ గవర్నర్ గా చేసిన తమిళిసై, తమిళనాడు బీజేపీ సీనియర నాయకుడు పొన్ రాథాకృష్ణన్ నాడార్ సామాజికవర్గానికి చెందినవారు. కాబట్టి నాడార్లలో కూడా గంపగుత్తగా ఒక కూటమికి ఓట్లు వేసే పరిస్థితి ఇప్పుడు కనబడటంలేదు. మొత్తం మీద చూస్తే గతంలోలా ఒక కులం ఓట్లన్నీ ఒక పార్టీకి పడే పరిస్థితి ప్రస్తుతం లేదని చెప్పాలి.
అన్నామలై
ఈ ఎన్నికల్లో అన్నామలైను పక్కన పెట్టటానికి ఒక కారణం వినబడుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తే, ససేమిరా అంటూ అన్నామలై అడ్డుపడ్డారు, ఒంటరిగా వెళ్ళేలా చేశారు. తీరా చూస్తే ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి. పొత్తు పెట్టుకుని ఉంటే మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవాళ్ళమని భావించిన మోదీ-షా ద్వయం, అన్నామలైను పక్కనపెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతోపొత్తు పెట్టుకుంది. 2024లో ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమలనాథులను ఒప్పించటం వలన జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలోకి రావటానికి మార్గం సుగమం అయితే, అన్నామలై మాట వినటం వలన చెడు జరిగిందని ఆ పార్టీ అధిష్ఠానం భావించినట్లుగా కనబడుతోంది.
అన్నట్టు, 2024 పార్లమెంట్ ఎన్నికలలో తమిళనాడులో డీఎంకే కూటమి 100% స్ట్రైక్ రేటుతో మొత్తం 39 స్థానాలనూ చేజిక్కించుకుంది. మొత్తంమీద, ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నాడీఎంకే కూటమికి, విజయ్ టీవీకే పార్టీకి మధ్య చీలుతుంది కాబట్టి డీఎంకే కూటమికి ప్రయోజనం చేకూరుతుందని స్థూలంగా చూస్తే అనిపిస్తుంది. అయితే డీఎంకేకు సంప్రదాయంగా పడుతూ వస్తున్న మైనారిటీ ఓటులో విజయ్ గణనీయంగా చీల్చగలిగితే మాత్రం డీఎంకేకు కష్టమవుతుంది. అయితే ఇదంతా విజయ్ ను ఒక సీరియస్ రాజకీయ నాయకుడిగా జనం పరిగణనలోకి తీసుకుంటే ఏర్పడే పరిస్థితి. అతని మాటలను, చేతలను బట్టి, జనం సీరియస్ గా తీసుకోకపోతేమాత్రం డీఎంకేకు
నల్లేరు మీద నడకే అవుతుంది.
పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా బాధితులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలుపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా..భారత్ ఎప్పటికీ తలవంచదని..ఉగ్రవాదుల హీనమైన కుట్రలు ఎప్పటికీ సఫలం కావని ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో దేశం మొత్తం ఐక్యంగా ఉందని ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు.
గతేడాది సరిగ్గా ఇదే రోజున పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు TRF ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని .. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మతం అడిగి మరి.. వారి కుటుంబ సభ్యుల కళ్లెదుటే అతి సమీపం నుండి కాల్చి చంపారు ఉగ్రమూకలు.
ఈ దాడిపై NIA దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఇప్పటికే హతమార్చాయి.. ఉగ్రవాదులకు సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేసి.. విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పాక్‌పై దాడులు చేసి చావుదెబ్బ కొట్టింది.
బెంగళూరులోని గుంతల రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. అధికారులు పట్టించుకోవడంలేదని ఫైరవుతున్నారు. తాజాగా ఓ వ్యాపారవేత్త వినూత్నంగా తన నిరసన తెలిపారు. తానే స్వయంగా రంగంలోకి దిగి గుంతల రోడ్లను పూడ్చేందుకు యత్నించాడు. ఏకంగా తన ఖరీదైన పోర్షే కారు బానెట్‌పైనే సిమెంట్ మిశ్రమాన్ని కలిపి, రోడ్డుపై ఉన్న గుంతను పూడ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరులో, ముఖ్యంగా వర్షాకాలం తర్వాత తరచూ ఎదురయ్యే గుంతల సమస్యపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తికి ఈ ఘటన అద్దం పడుతోందని అభిప్రాయపడుతున్నారు.
తమిళ స్టార్, టీవీకే అధినేత విజయ్ దంపతుల విడాకుల వ్యవహారం గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య సంగీత వేసిన విడాకుల పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణ జరిగie..న్యాయస్థానం. ఈ కేసును జూన్ 15కు వాయిదా వేసింది. ఆరోజు విజయ్, సంగీత ఇద్దరూ హాజరుకావాలని ఆదేశించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విజయ్ బిజీగా ఉన్న కారణంగా కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది తెలుపగా.. కోర్టు అంగీకరించనట్లు తెలుస్తోంది. జూన్ 15న ఆయన కూడా హాజరుకావాలని ఆదేశించింది
మరోవైపు వీరిద్దరి విడాకుల నేపథ్యంలో సెటిల్మెంట్కు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరస్పర విడాకులకు నామినేషన్లో విజయ్ తెలిపిన ఆస్తి వివరాల ప్రాతిపదికన రూ.250 కోట్లు సెటిల్మెంట్ ఇవ్వాలని సంగీత అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. కుమారుడు, కుమార్తెలకు కూడా సెటిల్మెంట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. సంగీతకు మాత్రం రూ.35 కోట్లు సెటిల్మెంట్ ఇచ్చేందుకు విజయ్ ఆమోదించినట్లు, కుమారుడు, కుమార్తెను చూసుకుంటానని చెప్పినట్లు కోలీవుడ్ మీడియా పేర్కొంది.