సార్వత్రిక ఎన్నికల సంరంభానికి తెర లేచింది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ పార్టీలు, అభ్యర్థులు డబ్బు విరివిగా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ సాగుతున్న వేళ.. బ్యాంకుల్లో అనుమానాస్పదంగా సాగే ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై అన్ని రాష్ట్రాల సీఈఓలకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల్లో లక్ష పై చిలుకు డిపాజిట్, విత్ డ్రాయల్ చేసిన అకౌంట్స్, ఒకే జిల్లాలో పలువురికి ఆన్ లైన్‌లో నగదు బదిలీ చేసిన ఖాతాల వివరాలను సేకరించాలని పేర్కొంది. వివిధ బ్యాంకుల్లో లక్షకు మించి డిపాజిట్ చేసిన అభ్యర్థి, ఆ అభ్యర్థి కుటుంబ సభ్యులు, పార్టీల ఖాతాల వివరాలను సేకరించాలని సీఈఓలను ఈసీ ఆదేశించింది. 10 లక్షలు డిపాజిట్ చేసిన ఖాతాల వివరాలను ఆదాయం పన్ను విభాగం అధికారులకు అందజేయాలని సూచించింది. జిల్లా ఎన్నికల అధికారులు అన్ని బ్యాంకుల నుంచి సమాచారం తెప్పించుకోవాలని, ఆ డేటాలో అనుమానాస్పదమైన లావాదేవీలు ఉంటే వాటి వివరాలను ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు ఇవ్వాలని పేర్కొంది
బ్యాంకు ఆర్థిక లావాదేవీలపై నిఘా…
104